Share News

AP High Court: తురకా కిశోర్‌ అరెస్టులో చట్టనిబంధనలు పాటించలేదు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:41 AM

వైసీపీ నేత తురకా కిశోర్‌ అరెస్టు, రిమాండ్‌ విధింపు విషయంలో పోలీసులు, మేజిస్ట్రేట్‌ చట్టనిబంధనలు పాటించలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

AP High Court: తురకా కిశోర్‌ అరెస్టులో చట్టనిబంధనలు పాటించలేదు

  • రిమాండ్‌ విధింపులోనూ ఉల్లంఘనలు

  • విడుదలకు ఆదేశాలిస్తామన్న ధర్మాసనం.. విచారణ నేటికి వాయిదా

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత తురకా కిశోర్‌ అరెస్టు, రిమాండ్‌ విధింపు విషయంలో పోలీసులు, మేజిస్ట్రేట్‌ చట్టనిబంధనలు పాటించలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కిశోర్‌ను అరెస్టు చేసే సమయంలో బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌-47 (అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం), సెక్షన్‌-48 (అరెస్టుకు గల కారణాల) కింద ఇచ్చిన నోటీసులు నిరాకరించి ఉంటే మధ్యవర్తి సమక్షంలో ఆ విషయాన్ని నమోదు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. నిందితుడు నోటీసులు తీసుకొనేందుకు నిరాకరించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో కూడా పేర్కొనలేదని గుర్తు చేసింది. అరెస్టు సమయంలో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించినట్లు, ఈ విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందినట్లు రిమాండ్‌ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. అరెస్టుతో పాటు రిమాండ్‌ విధింపు విషయంలో చట్టనిబంధనలు ఉల్లంఘిస్తే నిందితుడిని ఒక్క నిమిషం కూడా జైలులో ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఓ దశలో రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేసేందుకు సిద్ధమైంది. కిశోర్‌ విడుదలకు ఆదేశాలిస్తామని తెలిపింది. నిందితుడిని కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని మాత్రమే పిటిషనర్‌ వ్యాజ్యంలో కోరారని ఎస్‌జీపీ కోర్టు దృష్టికి తీసుకురావడంతో.... స్పందించిన ధర్మాసనం రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అనుబంధ పిటిషన్‌ వేయాలని సూచించింది. అనుబంధ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిశోర్‌ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు. కిశోర్‌పై పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ రోజుల్లో హత్యాయత్నం కేసు నమోదు చేయడం చాలా సులభమని, మాపైనా నమోదు చేయవచ్చని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో జరిగిన ఘటనలకు కిశోర్‌పై ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మోసిన నేరస్తుడి విషయంలో సైతం చట్టనిబంధనలు అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది.

Updated Date - Aug 07 , 2025 | 04:43 AM