Share News

AP High Court: టీటీడీ భూ మార్పిడిపై పిల్‌ కొట్టివేత

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:23 AM

తిరుపతి మండలం, పేరూరు పరిధిలో టీటీడీకి చెందిన భూమిని పర్యాటక శాఖతో పరస్పర మార్పిడి చేసుకోవడంతో పాటు ఆ భూమిని పర్యాటక శాఖ ఒబెరాయ్‌ గ్రూపునకు చెందిన.....

AP High Court: టీటీడీ భూ మార్పిడిపై పిల్‌ కొట్టివేత

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తిరుపతి మండలం, పేరూరు పరిధిలో టీటీడీకి చెందిన భూమిని పర్యాటక శాఖతో పరస్పర మార్పిడి చేసుకోవడంతో పాటు ఆ భూమిని పర్యాటక శాఖ ఒబెరాయ్‌ గ్రూపునకు చెందిన స్వరా హోటల్స్‌కు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ తిరు క్షేత్రాల రక్షణ సమితి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అంతకు ముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.... అధిక విలువ ఉన్న టీటీడీ భూమిని తక్కువ విలువ ఉన్న పర్యాటక శాఖ భూమితో పరస్పర మార్పిడి చేయడం సరికాదన్నారు. పర్యాటక శాఖ నుంచి తీసుకున్న భూమిని భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తామని మొదట టీటీడీ ప్రకటించిందన్నారు. తదనంతరం ప్రాజెక్టును మరో ప్రాంతానికి మార్చాలని నిర్ణయించిందన్నారు. టీటీడీ నుండి తీసుకున్న భూమిని పర్యాటక శాఖ హోటల్‌ నిర్మాణం కోసం ఒబెరాయ్‌ గ్రూపునకు చెందిన స్వరా హోటల్స్‌కు కేటాయించిందన్నారు. భూమార్పిడి వల్ల టీటీడీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. హోటల్‌ నిర్మాణం కోసం భారీ చెట్లను కూల్చివేస్తూ వోల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ... ‘టీటీడీ, పర్యాటక శాఖ పరస్పరం మార్పిడి చేసుకున్న భూములు రోడ్డుకు ఇరువైపుల ఉంటాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ విలువ వేర్వేరుగా ఉంటుందే తప్ప రెండు భూముల విలువ ఒకటే ఉంటుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ భూమిని స్వరా హోటల్స్‌కు కేటాయించింది’ అని తెలిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పరస్పరం మార్పిడి చేసుకున్న అనంతరం భూమిని పర్యాటక శాఖ థర్డ్‌ పార్టీకి అప్పగించిందని గుర్తు చేసింది. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్‌ను టీటీడీ మరో చోటకి మార్చిందనే కారణంతో టీటీడీ, పర్యాటక శాఖ మధ్య జరిగిన భూ మార్పిడిని రద్దు చేయలేమని పేర్కొంది. పిల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Dec 25 , 2025 | 04:23 AM