AP High Court: పవన్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణ..ఆ రివిజన్ పిటిషన్‌కు నంబర్ కేటాయించండి
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:42 AM
వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రాసిక్యూషన్ ఉపసంహరణను సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.
రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రాసిక్యూషన్ ఉపసంహరణను సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. వలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తోందని.. మహిళలు అపహరణకు గురవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తమ ప్రతిష్ఠకు భంగం కలిగించాయంటూ కొందరు వలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. అయితే కేసు వేసేందుకు అఫిడవిట్లు ఇచ్చిన ఐదుగురు వలంటీర్లు.. వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకుని పిటిషన్లు వేశారని వేరే అఫిడవిట్లు వేశారు. న్యాయాధికారి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంతో పవన్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి.. అందుకు అనుమతిస్తూ గత ఏడాది నవంబరులో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సరళ, మరో ముగ్గురు వలంటీర్లు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ నిరాకరించడంతో తగిన ఉత్తర్వుల కోసం వ్యవహారం న్యాయమూర్తి వద్దకు వచ్చింది. రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు.. నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని మంగళవారం ఆదేశించారు.