AP High Court: ఉత్తర్వులు అమలు కాలేదు.. కోర్టుకు రండి
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:39 AM
ఉద్యోగులకు పదోన్నతి కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు అమలులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
సీఎస్, సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం.. ఉద్యోగుల పదోన్నతిపై విచారణ
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు పదోన్నతి కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు అమలులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు నేరుగా తమముందు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.ఎం. నాయక్‌ను ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందనరావు, జస్టి్‌స్ టీసీడీ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు ఉద్యోగులు 2016, 2017లో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. రిజర్వ్‌డ్ కేటగిరీ ఉద్యోగులు పరిమితికిమించి ప్రమోషన్లు పొందితే, రిజర్వేషన్ పరిధిలోకి రాని ఇతర ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ 2018 డిసెంబరు 11న తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలుకాక పోవడంతో కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు మంగళవారం విచారణకు రాగా.. ఎ్‌సజీపీ ఎస్. ప్రణతి వాదనలు వినిపించారు.