Share News

AP High Court: కూల్చివేతకు మిగతా ఖర్చు చెల్లించండి

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:45 AM

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్‌ గోడ మిగిలిన భాగాన్ని...

AP High Court: కూల్చివేతకు మిగతా ఖర్చు చెల్లించండి

  • అక్రమ గోడ మిగిలిన భాగాన్ని తొలగించేందుకు జీవీఎంసీకి మరో 31.97 లక్షలు జమ చేయాలి

  • నేహారెడ్డి, అవ్యాన్‌ రియల్టర్స్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్‌ గోడ మిగిలిన భాగాన్ని తొలగించేందుకయ్యే ఖర్చును కూడా చెల్లించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీ అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీని హైకోర్టు గురువారం ఆదేశించింది. జీవీఎంసీ కోరిన విధంగా రూ.31.97 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో జీవీఎంసీకి జమ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు ధర్మాసనం పేర్కొంది. అలాగే అక్రమ కాంక్రీట్‌ నిర్మాణాలతో ప్రకృతికి రూ.17.46 కోట్ల నష్టం జరిగిందంటూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ ఇచ్చిన నివేదికపై నాలుగు వారాల్లోగా అభ్యంతరాలు తెలిపేందుకు నేహారెడ్డి, అవ్యాన్‌ రియల్టర్స్‌లకు వెసులుబాటు ఇచ్చింది. కాగా, నేహారెడ్డి, ఆమె కంపెనీ తరఫున న్యాయవాది సత్యప్రసాద్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, రెస్టోబార్‌ యజమానుల తరఫు న్యాయవాది సార్వభౌమారావు వాదనలు వినిపించారు.

Updated Date - Nov 07 , 2025 | 05:47 AM