Share News

AP High Court: మరో రెండు సెట్ల నివేదికలు సమర్పించండి

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:07 AM

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్‌ అదాలత్‌ వద్ద రాజీచేసిన వ్యవహారంతోపాటు నిందితుడు రవికుమార్‌ ఆస్తులకు సంబంధించిన నివేదికలు మరో రెండు సెట్లను...

AP High Court: మరో రెండు సెట్ల నివేదికలు సమర్పించండి

  • ‘పరకామణి’ కేసులో సీఐడీ, ఏసీబీలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్‌ అదాలత్‌ వద్ద రాజీచేసిన వ్యవహారంతోపాటు నిందితుడు రవికుమార్‌ ఆస్తులకు సంబంధించిన నివేదికలు మరో రెండు సెట్లను సీల్డ్‌ కవర్‌లో సోమవారంలోగా రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను హైకోర్టు ఆదేశించింది. చోరీ కేసు రాజీకి సంబంధించి లోక్‌ అదాలత్‌ అవార్డ్‌ చట్టబద్ధతపై విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం పరిశీలన నిమిత్తం ఈ నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఆ నివేదికలు తమకు కూడా ఇవ్వాలని నిందితుడు రవికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నాగేశ్వరరావు గత విచారణలో అభ్యర్థించారని గుర్తు చేసింది. ఈ దశలో వాటిని పొందేందుకు నిందితుడు అర్హుడు కాదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం సీఐడీ, ఏసీబీ డీజీలు వేసిన నివేదికలు కేవలం కోర్టు పరిశీలన కోసమేనని స్పష్టం చేసింది. నివేదికలను అధ్యయనం చేసి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా విచారణను ఈ నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ... ఈ కేసులో తాము ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశామన్నారు. కొత్త న్యాయవాది వకాలత్‌ వేశారని, కేసుల జాబితాలో ఆ న్యాయవాది పేరును ప్రచురించేలా చూడాలన్నారు. అందుకు అంగీకరిస్తూ, న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Dec 06 , 2025 | 05:08 AM