AP High Court: చంద్రబాబు సర్కార్‌కు కొత్త తలనొప్పి?
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:40 AM
విశాఖపట్నంతో పాటు విజయవాడలో లూలూ గ్రూపునకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
విజయవాడలో ‘లులు’కు భూ కేటాయింపు వ్యవహారంపై పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంతో పాటు విజయవాడలో లూలూ గ్రూపునకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పిల్‌పై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ నగరంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు సంబంధించి 13.5 ఎకరాలను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం లులు సంస్థకు కేటాయించబోతుందని పేర్కొంటూ పాకా సత్యనారాయణ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది అశోక్‌రామ్ వాదనలు వినిపించారు. లులు సంస్థకు 2018లో బిడ్డింగ్ ద్వారా భూమి కేటాయించారని తెలిపారు. 2019 నవంబరు 8న అప్పటి వైసీపీ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేసిందని పేర్కొన్నారు. బిడ్లు ఆహ్వానించకుండా, సంస్థ చైర్మన్ ప్రతిపాదనల మేరకు సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ సంస్థకు తిరిగి భూమిని కేటాయించారని వివరించారు. విజయవాడలో కూడా లులు సంస్థకు భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... విజయవాడలో లులు గ్రూపుకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌కు సూచించింది.