AP High Court: భూమిని వాడుకున్నా, లేకున్నా వార్షిక కౌలు చెల్లించాల్సిందే
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:15 AM
గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది....
గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల పిటిషన్‌పై హైకోర్టు
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. భూములు తీసుకున్న తర్వాత వాటిని వినియోగించుకున్నా, లేకున్నా వార్షిక కౌలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన తమకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లా, అజ్జంపూడి గ్రామానికి చెందిన మన్నం కృష్ణమూర్తి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.