Share News

AP High Court: షెల్టర్‌ హోమ్‌లపై ఏం చేస్తున్నారు?

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:14 AM

అనాథలు, నిరాశ్రయులు రాత్రివేళ్లలో ఫుట్‌పాత్‌ల మీద నిద్రించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పై తక్షణం దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP High Court: షెల్టర్‌ హోమ్‌లపై ఏం చేస్తున్నారు?

  • ఫుట్‌పాత్‌లపై అనాథలు నిద్రించే పరిస్థితి పోవాలి

  • విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అనాథలు, నిరాశ్రయులు రాత్రివేళ్లలో ఫుట్‌పాత్‌ల మీద నిద్రించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పై తక్షణం దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరాశ్రయుల కోసం విజయవాడతోపాటు అన్ని జిల్లా కేంద్రాలలో షెల్టర్‌ హోమ్స్‌ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని షెల్టర్‌ హోమ్‌లకు తరలించేలా తక్షణమే డ్రైవ్‌ నిర్వహించాలని విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించింది. విజయవాడ నగరంలో మహిళలకు ప్రత్యేకంగా ఒక్క నైట్‌ షెల్డర్‌ కూడా లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయవాది ఎన్‌.ఆది రామకృష్ణుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై విచారణలో ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది ఆది రామకృష్ణుడు వాదనలు వినిపిస్తూ.. నైట్‌ షెల్టర్లు ఉన్నప్పటికీ నిరాశ్రయులను అక్కడకు తరలించేందుకు కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ వాదనలు వినిపిస్తూ.... కార్పొరేషన్‌ ఇప్పటికే కొన్ని షెల్టర్‌ హోమ్స్‌ నిర్వహిస్తోందని, మరికొన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. అనాథలు, నిరాశ్రయుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో షెల్టర్‌ హోమ్స్‌ ఏర్పాటు విషయంలో కోర్టుకు సహాయ సహకారాలు అందించేందుకు సీనియర్‌ న్యాయవాది కేఎ్‌సమూర్తి ని అమికస్‌ క్యూరీగా ధర్మాసనం నియమించింది.

Updated Date - Dec 30 , 2025 | 04:14 AM