High Court: ఈ దశలో రక్షణ కల్పించలేం
ABN , Publish Date - May 03 , 2025 | 05:26 AM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ముఖ్య నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు అరెస్టు నుంచి రక్షణ కల్పించే విధంగా హైకోర్టు నిరాకరించింది. విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని కోర్టు స్పష్టం చేసింది.
మద్యం స్కాం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో అప్పటి సీఎం జగన్ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. వివరాలు సమర్పించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరుతున్న నేపథ్యంలో ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, చాణక్యల రిమాండ్ రిపోర్టులో తమ పాత్ర గురించి ప్రస్తావించారని.. అందుచేత అరెస్టు చేస్తారని ఆందోళన ఉందని, తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు రాగా.. సీఐడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. వ్యాజ్యాలు మొదటిసారి విచారణకు వచ్చాయన్నారు.
వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ధనుంజయరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది వికా్‌ససింగ్ స్పందిస్తూ.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ రోజే ఉత్తర్వులిచ్చి తీరాలన్నారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన న్యాయమూర్తి.. కేసు వివరాలు సమర్పించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరుతున్నందున ఈ దశలో రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వికా్‌ససింగ్ జోక్యం చేసుకుని.. తదుపరి విచారణలోపు అరెస్టు చేస్తే తమ వ్యాజ్యాలు నిరర్థకమవుతాయన్నారు. విచారణకు రావాలని తమకు నోటీసులు ఇచ్చి.. తాము హాజరుకాకుంటే ఆ కారణంతో బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ కోరే ప్రమాదం ఉందని.. అందుచేత అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. విచారణను ఇప్పటికే వాయిదా వేశామన్నారు. కోర్టు విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించవద్దని సీనియర్ న్యాయవాదికి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..