AP High Court: మిథున్‌రెడ్డిని కస్టడీలో విచారించాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:27 AM
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్
ఆయనపై మోపిన తీవ్ర అభియోగాలను విస్మరించలేం
నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతోంది
తమ సంస్థకు అందిన సొమ్ము మద్యం స్కామ్‌ది కాదనేందుకు ఆధారాలను చూపలేదు
ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం
నేర తీవ్రత, రూ.3,500 కోట్ల స్కామ్ దృష్ట్యా బెయిల్‌కు మిథున్‌రెడ్డి అనర్హుడు: న్యాయమూర్తి
మద్యం స్కాం ద్వారా వచ్చిన సొమ్ము మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు చేరిందని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఆ సొమ్ము మద్యం కుంభకోణం ద్వారా వచ్చింది కాదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలనూ మిథున్‌రెడ్డి ఈ కోర్టు ముందు ఉంచలేదు. నేర తీవ్రత, లిక్కర్ సిండికేట్ ద్వారా రూ.3,500 కోట్లు చేతులు మారడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్‌రెడ్డి అనర్హుడు.
- హైకోర్టు
అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మిథున్‌రెడ్డిపై మోపిన తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసేందుకు వీలుగా మద్యం పాలసీలో మార్పులు చేశారని ప్రాసిక్యూషన్ వాదిస్తోందని గుర్తుచేసింది. ఆయన సంస్థకు అందిన సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించింది కాదనేందుకు ఎలాంటి రుజువులనూ ఆయన చూపలేదని తెలిపింది. అందుచేత ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ‘దర్యాప్తులో భాగంగా సేకరించి, కోర్టు ముందుంచిన ఆధారాలను, పిటిషనర్ మిథున్‌రెడ్డి (ఏ-4)పై ప్రాసిక్యూషన్ మోపిన తీవ్రమైన ఆరోపణలను విస్మరించడానికి వీల్లేదు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తే లిక్కర్ పాలసీ రూపకల్పన నేరపూరిత కుట్రలో మిథున్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోంది. సేకరించిన ఆధారాలను ఆయన ముందు పెట్టి.. మద్యం పాలసీ రూపకల్పన, దాని అమలులో కుట్రకోణాన్ని తేల్చేందుకు కస్టోడియల్ విచారణ అవసరం.
మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్ము మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు చేరిందని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఆ సొమ్ము మద్యం కుంభకోణం ద్వారా వచ్చింది కాదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలనూ మిథున్‌రెడ్డి ఈ కోర్టు ముందు ఉంచలేదు. ఆయన పాత్రపై ప్రాసిక్యూషన్ ఆధారాలు కోర్టు ముందు ఉంచింది. ఈ నేపఽథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి, పిటిషనర్‌కు రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయనే కారణంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేం. తీవ్ర ఆరోపణలు ఉన్న ఇలాంటి కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ అవసరం. ముందస్తు బెయిలిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. ముందస్తు బెయిల్‌ను సర్వసాధారణంగా మంజూరు చేయడానికి వీల్లేదు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవు. నేర తీవ్రత, లిక్కర్ సిండికేట్ ద్వారా రూ.3,500 కోట్లు చేతులు మారడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్‌రెడ్డి అనర్హుడు. ఈ నేపఽథ్యంలో ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. మిథున్‌రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ మంగళవారం నిర్ణయం వెల్లడించారు.