Share News

AP High Court: పోలీసు శాఖను మూసేయండి

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:04 AM

టీటీడీ పరకామణిలో జరిగిన అక్రమాల విషయంలో నమోదైన కేసును లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ చేసుకున్న ఘటనకు సంబంధించి రికార్డులను సీజ్‌ చేయాలని...

AP High Court: పోలీసు శాఖను మూసేయండి

  • డీజీపీ సహా అధికారులు నిద్రపోతున్నారా?

  • రికార్డులు సీజ్‌ చేయమన్నా పట్టించుకోరా?

  • నిబద్ధత ఉంటే ఆదేశాలు అమలు చేయించేవారు

  • ‘పరకామణి’ కేసులో నిందితులకు సహకరించారు

  • ఏ కేసులో వేగంగా స్పందించాలో తెలియట్లేదా?

  • తదుపరి విచారణకు రికార్డులు కోర్టుకు ఇవ్వండి

  • సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశం.. పోలీసులపై ఆగ్రహం

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణిలో జరిగిన అక్రమాల విషయంలో నమోదైన కేసును లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ చేసుకున్న ఘటనకు సంబంధించి రికార్డులను సీజ్‌ చేయాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో పోలీస్‌ శాఖను మూసివేయడం మంచిదని, డీజీపీ నిద్రపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘‘పాలనాపరంగా శాఖలో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) పోస్టు లేదనే కారణంతో కోర్టు ఆదేశాలను అమలు చేయరా?.’’ అని ప్రశ్నించింది. సదుద్దేశం ఉంటే మరో ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులను సీజ్‌ చేసేందుకు డీజీపీ ఆదేశించేవారని వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారానికి డీజీపీనే బాధ్యులని పేర్కొంది. ‘‘రికార్డులు సీజ్‌ చేయమని గత నెల 19న ఉత్తర్వులు ఇచ్చాం. ఆ ఆదేశాలలో సవరణ అవసరమని భావిస్తే తక్షణమే అనుబంధ పిటిషన్‌ వేసి ఉండాల్సింది. రికార్డులను సీజ్‌ చేయమని ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా.. సీఐడీ ఐజీ స్థానంలో సీఐడీ ఎస్పీ లేదా డీజీని చేర్చాలని ఈ నెల 6న అనుబంధ పిటిషన్‌ వేయడం ఏంటి?. ఏ కేసులలో వేగంగా స్పందించాలో కూడా తెలియట్లేదా?. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా’’ అని ప్రశ్నించింది. కేసుకు ఉన్న ప్రాముఖ్యత గురించి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కానిస్టేబుల్‌కి కూడా తెలుసని, ఈ వ్యవహారంలో ఎంత నిజాయితీగా వ్యవహారించారో పోలీసు అధికారుల చర్యలే చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తునకు కీలకమైన కొద్దో గొప్పో ఆధారాలను సైతం తారుమారు చేసేలా, నిందితులకు సహరించేలా పోలీసులు చర్యలు ఉన్నాయని పేర్కొంది. మొత్తం వ్యవహారాన్ని దారి తప్పించారని వ్యాఖ్యానించింది. డిపార్ట్‌మెంట్‌ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిందని, పోలీసుశాఖను మూసివేయడం మంచిదని ఘాటుగా స్పందించింది. కేసుకి సంబంధించిన రికార్డులు అన్నింటినీ తక్షణం సీజ్‌ చేసి తదుపరి విచారణ రోజు తమ ముందుంచాలని సీఐడీ డీజీని ఆదేశించింది. విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.


అసలు వివాదం ఏంటి?

2023, వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల పరకామణిలో కుంభకోణం జరిగింది. ఈ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేయించాలని సమర్పించిన వినతిని ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) పరిగణనలోకి తీసుకోలేదు. ఈ చర్యలను చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ పాత్రికేయుడు ఎం. శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అదేవిధంగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబరు 10న ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెల్లడించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌ వేశారు. ‘‘పరకామణిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్‌ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారు. ఈ వ్యవహారంపై అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి వై. సతీశ్‌కుమార్‌ 2023, ఏప్రిల్‌ 29న తిరుమల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన అనంతరం టీటీడీ బోర్డు తీర్మానం, అప్పటి ఈవో అనుమతి లేకుండానే అదే ఏడాది సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌ వద్ద అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్నారు.’’ అని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి.. పరకామణి నుంచి నగదు అపహరణ విషయంలో ఇచ్చిన ఫిర్యాదును లోక్‌అదాలత్‌ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2023, సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయన్నారు. కేసులో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చారు. ప్రస్తుత కేసుతో ముడిపడి ఉన్న తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ రికార్డులు, లోక్‌ అదాలత్‌ ప్రొసీడింగ్స్‌, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రొసీడింగ్స్‌ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని, వాటిని సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని సీఐడీ ఐజీని గత విచారణలో ఆదేశించారు.


సీఐడీలో ఐజీ పోస్టు లేదు!

హైకోర్టులో ఈ పిటిషన్‌ సోమవారం మరోసారి విచారణకు రాగా సీఐడీ తరఫున ఏపీపీ పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. ‘‘రికార్డులను సీజ్‌ చేయాలని సెప్టెంబరు 19న సీఐడీ ఐజీకి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, సీఐడీలో ఐజీ పోస్టు లేదు. ఈ నేపథ్యంలో రికార్డులు సీజ్‌ చేసే బాధ్యతను సీఐడీ ఎస్పీ, డీజీకి అప్పగిస్తూ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ.. అనుబంధ పిటిషన్‌ వేశాం’’ అని కోర్టుకు వివరించారు.

Updated Date - Oct 14 , 2025 | 04:05 AM