Share News

AP High Court: ఇంటి పనులు సబార్డినేట్‌ విధుల్లో భాగం కాదనలేం

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:08 AM

కొందరు న్యాయాధికారుల అనుచిత ప్రవర్తనను ఆధారంగా చేసుకుని ఆఫీస్‌ సబార్డినేట్లకు కేటాయించిన ప్రాథమిక విధులను మార్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

AP High Court: ఇంటి పనులు సబార్డినేట్‌ విధుల్లో భాగం కాదనలేం

  • కొందరు న్యాయాధికారుల తీరుతో ఆ విధులు మార్చలేం: హైకోర్టు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): కొందరు న్యాయాధికారుల అనుచిత ప్రవర్తనను ఆధారంగా చేసుకుని ఆఫీస్‌ సబార్డినేట్లకు కేటాయించిన ప్రాథమిక విధులను మార్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయాధికారుల నివాసాల్లో ఇంటి పనులు నిర్వహించేందుకు కొంతమంది ఆఫీస్‌ సబార్డినేట్లను అటాచ్‌ చేసే విధానం జిల్లా న్యాయవ్యవస్థలో కొనసాగుతోందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఇంటి పనులు ఆఫీస్‌ సబార్డినేట్‌ విధుల్లో భాగం కాదన్న పిటిషనర్‌ వాదనను ఆమోదించలేమని పేర్కొంది. గృహసంబంఽధ పనుల నిర్వహణలో న్యాయాధికారుల నుంచి ఏమైనా వేధింపులు ఎదురైతే పరిపాలనాపరంగా ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ జగడం సుమతితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. దిగువ కోర్టుల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులకు ఆయా న్యాయాధికారుల నివాసాల్లో అనధికారిక, ఇంటి పనులు అప్పగించకుండా సబార్డినేట్‌ జ్యుడీషియరీ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏపీ జ్యుడీషియల్‌ ఆఫీస్‌ సబార్డినేట్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి టి.విజయలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేశారు. ఉమ్మడి హైకోర్టు తీర్పుల నేపథ్యంలో 1992లో జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్న విధులను తుది జాబితాగా పరిగణించలేమని, అవసరమైన సమయంలో సబార్డినేట్లకు ఇతర విధులు కూడా అప్పగించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Updated Date - Jul 12 , 2025 | 09:01 AM