Share News

AP High Court: అంగన్‌వాడీ కార్యకర్త తొలగింపుపై హైకోర్టు ఆక్షేపణ

ABN , Publish Date - Jul 20 , 2025 | 05:01 AM

ఓ అంగన్‌వాడీ కార్యకర్తను అధికారులు ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

AP High Court: అంగన్‌వాడీ కార్యకర్త తొలగింపుపై హైకోర్టు ఆక్షేపణ

  • పిటిషనర్‌కు రూ.25 వేలు చెల్లించాలని ఆదేశం

అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఓ అంగన్‌వాడీ కార్యకర్తను అధికారులు ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పిటిషనర్‌ వన లక్ష్మిని ఉద్యోగం నుంచి తొలగించే విషయంలో అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ కూడా తీసుకోలేదని ఆక్షేపించింది. పిటిషనర్‌ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకుగాను నాలుగు వారాల్లో ఆమెకు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పొన్నంపేటకు చెందిన లక్ష్మి 2012 సెప్టెంబరులో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు ఎంపికయ్యారు. విధుల్లో చేరిన నాలుగు నెలల తర్వాత లక్ష్మి తమ గ్రామవాసి కాదని, ఆమె వయస్సు 35 ఏళ్లు దాటిందని పొన్నంపేటకు చెందిన జి.శ్యామల, ఎస్‌.త్రినాథమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా లక్ష్మిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐసీడీఎస్‌ పీవో 2013 జనవరి 8న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.నాగేశ్వరరావు ఆమె పొన్నంపేటకు చెందినవారేనని తహశీల్దార్‌ ధృవీకరణపత్రం ఇచ్చారన్నారు. ఈ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు.

Updated Date - Jul 20 , 2025 | 05:03 AM