AP High Court: కిడ్నాప్ ఫిర్యాదు జనరల్ డైరీలో రాస్తారా
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:08 AM
తన భర్తను కిడ్నాప్ చేశారని భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా జీడీ(జనరల్ డైరీ)లో ఎంట్రీ చేయడం ఏంటని పోలీసులను హైకోర్టు..
ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు
‘సవీంద్రరెడ్డి’ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు సూటి ప్రశ్న
ఆలస్యంగా అరెస్టు చూపిన ప్రత్తిపాడు పోలీసులు
గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడి
అమరావతి/గుంటూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తన భర్తను కిడ్నాప్ చేశారని భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా జీడీ(జనరల్ డైరీ)లో ఎంట్రీ చేయడం ఏంటని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కాగ్నిజబుల్ కేసుల్లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకా లను అనుసరించకపోవడాన్ని ఆక్షేపించింది. గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన కుంచాల సవీంద్రరెడ్డి ఆచూకీ తెలుసుకొని బుధవారం తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. సవీంద్రరెడ్డి తమ ఆధీనంలో లేరని తాడేప ల్లి పోలీసులు చెబుతున్న నేపథ్యంలో అతడిని ఇతర స్టేష న్ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే హైకోర్టు ముందు హాజరుపర్చాలని.. ఏ ఇతర మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చవద్దని స్పష్టం చేసింది. విచారణను బుధవారానికి వాయిదా వే సింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాస నం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తన భర్త, గుంటూరు జిల్లా, వైసీపీ వలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచాల సవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన భార్య లక్ష్మీప్రసన్న హెబియస్ పిటిషన్ దా ఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం లంచ్‌మోషన్‌గా స్వీకరించింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. ‘సవీంద్రరెడ్డి తాడేపల్లి పోలీసుల అదుపులో లేరు. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆయ న భార్య ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. జనరల్ డైరీలో రాశారు. సవీంద్రరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు’ అని వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు.
సమాచార లోపం!
సవీంద్రరెడ్డిని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సోమవారం సాయంత్రమే అరెస్టు చేశారు. గంజాయి విక్రయాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు ఆయనను అరెస్టు చేసి, కిలోన్నర గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సవీంద్రరెడ్డిని అరెస్టు చేసినట్టు మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడు పోలీసులు వెల్లడించారు. అయితే, సమాచార లోపం కారణంగా ఈ విషయాన్ని హైకోర్టుకు వివరించలేకపోయినట్టు తెలిసింది.