AP HC: గోడ కూల్చివేత ఖర్చు చెల్లించండి
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:18 AM
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీకి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు...
వారంలోగా 48.21 లక్షలను జీవీఎంసీ వద్ద జమ చేయండి
17.46 కోట్ల నష్టపరిహారం.. నివేదికపై అభిప్రాయం చెప్పండి
నేహారెడ్డి, అవ్యాన్ రియల్టర్స్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీకి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ గోడను కూల్చేందుకు ఇప్పటి వరకు అయిన రూ.48.21 లక్షల ఖర్చును తదుపరి విచారణలోగా జీవీఎంసీ వద్ద జమ చేయాలని ఆదేశించింది. కాంక్రీట్ నిర్మాణం కారణంగా ప్రకృతికి నష్టం జరిగిందని, అందుకుగాను సంబంధిత కంపెనీ నుంచి రూ. 17.46 కోట్ల నష్ట పరిహారం రాబట్టాలని కేంద్ర అటవీ-పర్యావరణ శాఖ కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందన తెలపాలని అవ్యాన్ రియల్టర్స్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి రెస్టోబార్‌లు నిర్మాణం చేశారని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఏపీసీజెడ్‌ఎంఏ) మెంబర్ సెక్రెటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందన తెలపాలని రెస్టోబార్ యాజమాన్యాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. సముద్రానికి అతిసమీపంలో నేహారెడ్డి కంపెనీ కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి యాదవ్ పిల్ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 4 రెస్టోబార్లను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని గ్రామాభివృద్ధిసేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు కూడా పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా.. గోడ నిర్మాణం కారణంగా ప్రకృతికి రూ 17.46 కోట్లు నష్టం జరిగిందని ఎంవోఈఎఫ్ కమిటీ అంచనా వేసిందని కేంద్రం తరఫున ఏఎస్‌జీ చల్లా ధనంజయ తెలిపారు. గోడ కూల్చివేతకు ఇప్పటివరకు రూ 48.21 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ సొమ్ము చెల్లించాలని అవ్యాన్ రియల్టర్స్‌కు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని ఎ్‌సజీపీ ఎస్.ప్రణతి తెలిపారు.