AP HC: నిందితుడి ప్రాథమిక హక్కులు హరించారు
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:11 AM
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసులో నిందితుడు తిరుపతి లోకేశ్‌ను పోలీసులు 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడాన్ని...
24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు
నష్ట పరిహారం కింద రూ.10 వేలు చెల్లించండి
విజయవాడ సైబర్ క్రైమ్ ఎస్‌హెచ్‌వోకు హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసులో నిందితుడు తిరుపతి లోకేశ్‌ను పోలీసులు 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుడి ప్రాథమిక హక్కులను పోలీసులు హరించారని అభిప్రాయపడింది. ఆయనకు నష్టపరిహారం కింద రూ.10 వేలు చెల్లించాలని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. సొమ్ము చెల్లించి లోకేశ్ నుంచి రశీదు తీసుకోవాలని, దాన్ని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని స్పష్టం చేసింది. సొమ్ము చెల్లించారా..? లేదా అనే వివరాలను డిసెంబరు 15న తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఉత్తర్వులు అమలుకాకుంటే ఆ రోజు తదుపరి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది.