AP HC Clarifies: ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు..హైకోర్టులో మాత్రమే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:01 AM
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పుడు.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు విషయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టత ఇచ్చింది
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు: హైకోర్టు ధర్మాసనం
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పుడు.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు విషయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ల వర్తింపునకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్ 438 కింద హైకోర్టులో మాత్రమే ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు వెళ్లనవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లు 18, 18ఏ కింద ముందస్తు బెయిల్ దాఖలుపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించే పరిధి, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 14ఏ కింద అప్పిలేట్ పరిధి.. రెండూ హైకోర్టు కలిగి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పాటు ముందస్తు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను విచారణ నిమిత్తం తగిన బెంచ్‌కు నివేదించడానికి వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి, జస్టిస్ వి.సుజాతతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసులు నమోదైనప్పుడు ముందస్తు బెయిల్ కోసం ముందుగా సంబంధిత ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. అనంతరం అక్రమ మైనింగ్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
అలాగే టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్‌చార్జి పిల్లి కోటి ఫిర్యాదు మేరకు మరో మాజీ మంత్రి విడదల రజనిపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు పెట్టారు. మరికొందరు నిందితులు కూడా హైకోర్టులోని మరో సింగిల్ జడ్జి ముందు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ద్విసభ్య ధర్మాసనానికి నివేదించాలని ప్రధాన న్యాయమూర్తిని సింగిల్ జడ్జి కోరారు.