Handloom Sector Announces Discounts: ఆప్కో ఆఫర్‌డిస్కౌంట్ 60శాతం
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:41 AM
సంక్రాంతి, నూతన సంవత్సరం సందర్భంగా చేనేత వస్త్రాలపై చేనేత జౌళి శాఖ భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి, నూతన సంవత్సరం సందర్భంగా చేనేత వస్త్రాలపై చేనేత జౌళి శాఖ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మంగళగిరిలో 60శాతం, విజయవాడ ఆప్కో షోరూమ్‌లో 50శాతం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 40శాతం రాయితీ ఇవ్వనుంది. తెలుగు వారందరూ చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరించాలని ఆ శాఖ మంత్రి ఎస్.సవిత కోరారు. చేనేతల సమస్యలు, నేతన్నలకు రాయితీ, వస్త్ర వ్యాపారాలు, క్లస్టర్ల ఏర్పాటు, సొసైటీల నుంచి నేత ఉత్పత్తుల కొనుగోలు తదితర అంశాలపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మంగళవారం సమీక్షించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ఆప్కో ద్వారా డిస్కౌంట్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ నెల 29 నుంచి రాయితీతో వస్త్రాలు విక్రయించాలని మంత్రి అధికారులకు నిర్దేశించారు. తిరుపతిలో ఈ నెల 26 నుంచి చేనేత ఎగ్జిబిషన్ నిర్వహించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల చేనేతల ఉత్పత్తులు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్, పిఠాపురంలో స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం, రాష్ట్రవ్యాప్తంగా 30 ఆప్కో షోరూమ్‌ల అభివృద్ధికి రూ.99.60 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఈ సమావేశంలో కమిషనర్ రేఖా రాణి వివరించారు.