AP Govt: టెట్‌పై సుప్రీంలో రివ్యూ పిటిషన్
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:48 AM
ఇన్ సర్వీసు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ లేకుండా టీచర్ ఉద్యోగాలు పొందినవారు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేయాలని నిర్ణయం
ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం ప్రయత్నం
మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్సీలు.. ‘రివ్యూ’పై హామీ
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీసు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ లేకుండా టీచర్ ఉద్యోగాలు పొందినవారు.. ఇప్పుడు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల 2011కు ముందు ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్లు వేశాయి. అనేక ఉపాధ్యాయ సంఘాలు తీర్పును సమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ర్టానికి చెందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ వేస్తే వాదనలు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రివ్యూ పిటిషన్ వేస్తాం: లోకేశ్
టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. 2010 అక్టోబరు 23కు ముందు డీఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.