Share News

AP Govt: చేనేతకు చేయూత

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:59 AM

చేనేత రంగానికి ఊతమిచ్చేలా.. నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీని తానే భరించాలని నిశ్చయించింది.

AP Govt: చేనేతకు చేయూత

  • హ్యాండ్లూమ్‌ వస్త్రాలపై ప్రభుత్వమే జీఎస్టీ భరించాలని నిర్ణయం

  • మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

  • పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు

  • రేపటి నుంచి అమలుకు సీఎం ఆదేశం

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగానికి ఊతమిచ్చేలా.. నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీని తానే భరించాలని నిశ్చయించింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో చేనేత శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇటీవల జమ్మలమడుగులో తాను పర్యటించినప్పుడు ఓ చేనేత కుటుంబసభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్‌ అందించాలని సమీక్షలో నిర్ణయించారు. సంబంధిత ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించాలనీ నిర్ణయించారు. దీంతో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది. దీని వల్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. గురువారం (7వ తేదీన) జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని ఆదేశించారు. కాగా.. రాష్ట్రానికి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. ‘వన్‌ డిస్ర్టిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్‌’ విభాగంలోనూ మొదటి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను అధికారులు తొలుత సీఎంకు చూపించారు.

Updated Date - Aug 06 , 2025 | 04:02 AM