Revenue Department: వివాదాస్పదులపై వేటు
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:01 AM
వివాదాస్పద వ్యవహార శైలి, పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలో కీలకమైన ఇద్దరు రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
విశాఖ డీఆర్వో, ఆర్డీవోపై చర్యలు
జీఏడీకి అటాచ్ చేస్తూ దీపావళి రోజు ఉత్తర్వులు
ఆర్డీవో శ్రీలేఖ కొంపముంచిన ఒంటెద్దు పోకడలు
సర్వీస్ ఫైల్ తొక్కిపెట్టారని డీఆర్వోపై వ్యతిరేకత
కలెక్టర్, జేసీ కాల్స్, మెసేజీలకు స్పందించని వైనం
ప్రతి సోమవారం జరిగే ప్రజా స్పందనకూ గైర్హాజరు
పత్రికల్లో కథనాలతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద వ్యవహార శైలి, పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలో కీలకమైన ఇద్దరు రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఉపేక్షించబోమని సంకేతాలు పంపింది. ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్‌లను పక్కకు తప్పిస్తూ... దీపావళి సెలవు రోజునే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇద్దరినీ అమరావతిలో జీఏడీకి సరండర్ చేశారు. విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా జేసీ మయూర్ అశోక్‌కు, విశాఖ ఆర్డీవో బాధ్యతలను హెచ్‌పీసీఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సనపల సుధాసాగర్‌కు తాత్కాలికంగా అప్పగించారు. వీరిద్దరూ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు.
ఆది నుంచీ వివాదాలే
డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖ గతేడాది అక్టోబరులో ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తరువాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దల దన్ను ఉందని ఆర్డీవో ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడం ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం ధిక్కరించేవారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ఆమె ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విధులు నిర్వహించారు. అప్పట్లో నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదంటూ ఆమెను జిల్లా కలెక్టర్ సరండర్ చేశారు. మూడు నెలల పాటు ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. గత అక్టోబరులో విశాఖ ఆర్డీవోగా వచ్చారు. తన సర్వీస్ రెగ్యులర్ చేసే ఫైల్‌ను పైకి పంపకుండా డీఆర్వో భవానీశంకర్ తొక్కిపెట్టారని అనుమానంతో ఆయన పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడం ప్రారంభించారు. కలెక్టర్ ఫోన్ చేసినా స్పందించేవారు కాదు. ఆమెకు ఏదైనా పని చెప్పాలంటే ఉన్నతాధికారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్లు వేచిచూసిన కలెక్టర్ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.
డీఆర్వోపై ఫిర్యాదు...
పెందుర్తి మండలం ఏకలవ్య నగర్‌లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారం శ్రీలేఖ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. చాలాకాలం నుంచి అక్కడ విగ్రహం ఉండగా, స్థల యజమాని ఫిర్యాదుపై రాత్రికి రాత్రి దానిని తొలగించాలని ఆదేశించారు. స్థానిక సంఘాలు కలెక్టరేట్‌కు వెళ్లి ఆధారాలు చూపించడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ విషయమై శ్రీలేఖకు షోకాజ్ నోటీసు ఇవ్వడం, ఆ విషయం పత్రికల్లో రావడంతో ఆమె డీఆర్వో భవానీ శంకర్‌పై ఎదురు దాడికి దిగారు. ఆయన తహశీల్దార్ కార్యాలయాల నుంచి ప్రతినెలా సరకులు తెప్పించుకుంటున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ లేఖను పత్రికలకు లీక్ చేశారు. దాంతో వారిమధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆర్డీవో ఆరోపణలు అవాస్తవమని వివరించారు. అయితే అప్పటికే ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడం, ఆమెను సమర్థిస్తున్న నాయకులు కూడా ఆమె కారణంగా తమకు చెడ్డపేరు వస్తుందని భావించడంతో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కలెక్టర్, నిఘా వర్గాలతో పాటు, నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వివాదానికి కారణమైన ఆర్డీవో, డీఆర్వోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.