AP Govt Speeds Up: పెండింగ్ ఉపాధి బిల్లులకు మోక్షం
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:55 AM
పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపును ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసింది...
2014-19లో చేసిన పనులకు తాజాగా 145 కోట్ల విడుదలకు రెడీ
కాంట్రాక్టర్ల ఖాతాల్లో ఎల్లుండి నిధులు జమ
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపును ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో చేసిన ఉపాధి పనులకు బిల్లుల చెల్లింపు కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో చెల్లించాల్సిన బిల్లులను రాజకీయ కక్షతో నిలిపివేసింది. బిల్లులు ఇవ్వకపోగా పనులను కూడా నిలిపివేసింది. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం పెండింగు బిల్లులపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు ఈ విషయంపై పలుమార్లు చర్చించి నిధుల చెల్లింపునకు ఉన్న అడ్డంకులను తొలగించారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 3,54,177 పనులను తిరిగి గాడిలో పెట్టడంతోపాటు బిల్లుల చెల్లింపును ప్రారంభించారు. ఈ ప్రక్రియపై సీఎం చంద్రబాబు సచివాలయంలో బుధవారం మరోసారి సమీక్షించారు. తొలుత రూ.179.38 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి కొన్ని పనులను ప్రస్తుతం కొనసాగుతున్నవిగా గుర్తించారు. వాటిని పక్కన పెట్టి, పనులు పూర్తయిన వాటికి రూ.145 కోట్ల మేరకు చెల్లింపునకు మార్గం సుగమమయ్యేలా సంబంధిత వివరాలను పంచాయతీరాజ్ శాఖ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ మొత్తానికి సంబంధించి ఆర్థికశాఖ ఎన్‌ఐసీకి నిధులు విడుదల చేసింది. పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, గ్రామస్థుల అక్కౌంట్లలో ఈ నెల 23న ఈ నిధులు జమకానున్నాయి. మరికొంత మొత్తానికి సంబంధించి పలు సాంకేతిక కారణాలతో చెల్లింపు ప్రక్రియ ఆగిపోయింది. వీటిపైనా కసరత్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మొత్తం పెండింగ్ రూ.329 కోట్లు
ఉపాధి పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం చెల్లించకుండానిలిపేసిన మొత్తాన్ని రూ.329 కోట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే కొంత మేరకు చెల్లించారు. ఈ నెల 23వ తేదీన రూ.145 కోట్లను విడుదల చేయనున్నారు. ఈనిధులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.250 కోట్లను చెల్లించినట్లు అవుతుంది. ఫలితంగా చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారికష్టాలు తీరనున్నాయి.