Illegal Land Registration:పెద్దిరెడ్డికి ప్రభుత్వం షాక్
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:18 AM
వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.
ఆయన భార్య స్వర్ణలత, బినామీల డీకేటీ భూముల రిజిస్ర్టేషన్ల రద్దు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు
అక్రమాలకు సహకరించిన అధికారిపైనా చర్యలు
రాయచోటి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత, బినామీల పేరు మీద జరిగిన డీకేటీ భూముల అక్రమ రిజిస్ర్టేషన్లను రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అక్రమాలకు సహకరించిన అఽధికారులపైనా క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో సర్వే నంబరు 558లో 48.68 ఎకరాల భూమి రెవెన్యూ రికార్టుల్లో గయాలుగా నమోదైంది. ఈ భూమిని 1991లో 1 నుంచి 11 నంబర్ల వరకు సబ్ డివిజన్ చేశారు. ఇందులో 558/11లోని 4.90 ఎకరాల భూమిని అసైన్‌మెంట్ నంబరు 112/4/1395 ద్వారా సి.గురుమూర్తి అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది. ఇతను 2020లో చనిపోయారు. ఇతనికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ ఇతర రాష్ట్రంలో ఉన్నారు. దీంతో గురుమూర్తి సోదరుడు వెంకటరమణ, అతడి కొడుకు సాయిప్రసాద్ ఆ భూమికి తప్పుడు, నకిలీ పత్రాలు సృష్టించి.. రెవెన్యూ రికార్డుల్లో గురుమూర్తి వారసుల పేరుకు బదులుగా తన పేరు ఎక్కించుకున్నాడు. 1బీ రికార్డులు కూడా తీసుకున్నాడు. ఈ భూమికి 2024 జనవరి 3న ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్ పొందాడు. తర్వాత 2024 ఫిబ్రవరి 2న ఈ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు (డాక్యుమెంటు నంబరు 1213/2024) అమ్మేశాడు.
ఈ విషయమై గురుమూర్తి కొడుకు కుమార్ మదనపల్లె కోర్టులో దావా వేశారు. చట్టబద్ధ వారసులమైన తమకే భూమి దక్కాలని కోరారు. తన భూమిని అక్రమంగా కొన్నారని ప్రశ్నించిన గురుమూర్తి కొడుకు కుమార్‌ను పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి బెదిరించాడంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మదనపల్లె సబ్‌కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఈ అక్రమ రిజిస్ర్టేషన్‌ను కలెక్టర్ రద్దు చేసి, ఈ భూమిపై ఎటువంటి రిజిస్ర్టేషన్లు జరక్కుండా చూడాలని జిల్లా రిజిస్ర్టార్‌కు శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. భూమిని నిషేధిత జాబితాలో చేర్చమని మదనపల్లె తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇదే గ్రామంలోని సర్వే నంబరు 546/1లో 3.34 ఎకరాల భూమిని సైతం చట్ట విరుద్ధంగా అమ్మేశారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ర్టేషన్లను రద్దు చేయాలంటూ స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు కలెక్టర్ లేఖ రాసినట్లు తెలిసింది. కాగా, వలసపల్లెలోని సర్వే నంబరు 546/1లో 3.34 ఎకరాల డీకేటీ భూమిని ఎస్‌ఎ్‌సవీ మౌనీ్‌ష కుమార్‌రెడ్డి పేరు మీద పీలేరు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ పూతలపట్టు రాజు రిజిస్ర్టేషన్ (డాక్యుమెంటు నంబరు 620/2024) చేసేశారు. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పూతలపట్టు రాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.