Share News

AP Govt: లాటరీతోనే బార్లకు లైసెన్స్‌లు

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:46 AM

కొత్త బార్‌ పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు తుది దశకు చేరింది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్స్‌లు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది.

AP Govt: లాటరీతోనే బార్లకు లైసెన్స్‌లు

  • మద్యం దుకాణాల తరహాలోనే!.. ఫీజుల వసూలుకు రెండు ప్రతిపాదనలపై కసరత్తు

  • మొదటి దానివల్ల రాబడి తగ్గే చాన్సు.. దాని భర్తీకి బార్ల సంఖ్య వెయ్యికి పైగా పెంపు?

  • ఫీజులు భారీగా పెంచాలని రెండో ప్రతిపాదన.. నగర పంచాయతీల్లో బార్లకు 55 లక్షలు

  • మున్సిపాలిటీల్లో 65 లక్షలు.. కార్పొరేషన్లలోని బార్లకు రూ.75 లక్షలు

  • ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం.. 15లోగా కొత్త విధానంపై నోటిఫికేషన్‌

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కొత్త బార్‌ పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు తుది దశకు చేరింది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్స్‌లు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. జగన్‌ హయాంలో వేలం విధానంలో బార్లకు లైసెన్స్‌లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత బార్లకు యథావిధిగా లైసెన్స్‌లు పొడిగించి.. కొత్త వాటికి మాత్రం లాటరీ నిర్వహించాలని వ్యాపారులు కోరినా.. మొత్తం బార్లకు కొత్తగానే లైసెన్స్‌లు జారీచేయాలని ఎక్సైజ్‌ శాఖ నిశ్చయించింది. లైసెన్స్‌ ఫీజుల విషయంలో రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. నగర పంచాయతీ బార్లకు రూ.35 లక్షలు, మున్సిపాలిటీల్లోని బార్లకు రూ.40 లక్షలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని బార్లకు రూ.45 లక్షలు లైసెన్స్‌ ఫీజులుగా పెట్టాలన్నది మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదనలో నగర పంచాయతీల్లోని బార్లకు రూ.55లక్షలు, మున్సిపాలిటీల్లోని బార్లకు రూ.65లక్షలు, కార్పొరేషన్లలోని బార్లకు రూ.75 లక్షలుగా పేర్కొన్నారు. అయితే మొదటి ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గుతుంది. దానిని భర్తీ చేసేందుకు బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచాలనే ఆలోచన ఉంది. ఒకవేళ రెండో ప్రతిపాదన ప్రకారం ఫీజులు ఎక్కువగా ఉంటే బార్ల సంఖ్య యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఫీజులు తగ్గించి, బార్ల సంఖ్య పెంచడానికే ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు. అలాగే బార్లకు ఇచ్చే ధరను కూడా మద్యం దుకాణాలతో సమానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేస్తాయి. అయితే షాపులతో పోలిస్తే బార్లు 10 శాతం అదనంగా ధర చెల్లిస్తాయి. దానిని తగ్గించడం వల్ల ఏడాదికి దాదాపు రూ.300 కోట్లు నష్టపోవలసి వస్తుందని అంచనా. దానిని లైసెన్స్‌ ఫీజుల రూపంలో అదనంగా రాబట్టుకోవాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. అలాగే దరఖాస్తు రుసుమును రూ.5 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం పాలసీపై ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని ఈ నెల 15లోగా కొత్త పాలసీకి నోటిఫికేషన్‌ జారీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత బార్‌ పాలసీ గడువు నెలాఖరుతో ముగియనుంది.

Updated Date - Aug 04 , 2025 | 03:46 AM