AP High Court orders: రేపటి లోగా 22ఏ జాబితాలు ఇవ్వండి
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:33 AM
రాష్ట్రంలో నిషేధిత జాబితా(22ఏ)లో ఉన్న భూముల అంశంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం స్పందించింది..
కలెక్టర్లకు స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ లేఖలు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్య
హైదరాబాద్, సెప్టెంబరు13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేధిత జాబితా(22ఏ)లో ఉన్న భూముల అంశంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం స్పందించింది. 22ఏలో ఉన్న భూముల వివరాలను సోమవారం(సెప్టెంబరు 15)లోగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు అందజేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు లేఖలు రాశారు. 2016లో జారీ అయిన జీవో 121లో నిర్దేశించిన ప్రకారం భూముల జాబితాను ఇవ్వాలని, తెల్ల కాగితం మీద భూముల వివరాలు రాసి ఇస్తే పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. నిషేధిత భూముల జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు 9వారాల్లోగా అందించాలని ఆగస్టు 25న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జాబితాల అంశంలో కలెక్టర్లకు లేఖలు వెళ్లాయి. అయితే, 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 22ఏ జాబితాలు అందిన వెంటనే వాటిని సమీక్షిస్తామని స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు.
నిషేధిత భూముల శాతం పెరుగుతూ వస్తోంది
సాధారణంగా ఓ గ్రామంలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల భూమి ఉంటుంది. అందులో అటవీ భూములు, వాగులు, కుంటలు, చెరువులు, గుట్టలు, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు 10 నుంచి 20 శాతం మించి ఉండవు. కానీ, 2017 నుంచి రాష్ట్రంలో ఈ సంఖ్య పెరుగుతోంది. పలు కారణాలతో పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో చేరుతున్నాయి. ఒక సర్వే నంబరులో కొంత ప్రభుత్వ భూమి ఉంటే.. ఆ సర్వే నంబరులో ఉన్న మొత్తం భూమిని 22ఏలో పెడుతున్నారు. గతంలో నిషేధిత జాబితాలో ఉండి తర్వాత ప్రభుత్వం తొలగించినా.. వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే, 22ఏ జాబితా తయారు చేసే సమయంలో టైపింగ్ పొరపాట్ల వల్ల కూడా కొన్ని భూములు జాబితాలోకి ఎక్కుతున్నాయి. భూభారతి పోర్టల్ ప్రకారం 40 శాతం భూములు 22ఏ కింద ఉన్నాయి. అలాగని, ప్రభుత్వం ఈ విషయంలో ఉదారంగా స్పందిస్తే.. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉంది. ఈ సమస్యను సమీక్షించేలా రాష్ట్ర స్థాయిలో ఓ వ్యవస్థ ఉండాలి. - భూమి సునీల్