AP Govt: చేనేతల మగ్గాలు,పవర్‌లూమ్స్‌కు ఉచిత విద్యుత్
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:52 AM
రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది.
సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీ
నేటి నుంచే నేతన్నకు ఉచిత కరెంటు అమలు
ఒక్కో కుటుంబానికి నెలకు 200 యూనిట్లు,మర మగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచితం
పథకం అమలుకు రూ.189.62 కోట్లు
జీఎస్టీ భారం 15కోట్లు భరించనున్న ప్రభుత్వం
త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి 5 కోట్లు విడుదల
చేనేత దినోత్సవం సందర్భంగా 3 పథకాలకు శ్రీకారం
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకూ విద్యుత్తును ఉచితంగా అందించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు రూ.1,233 చొప్పున ఏటా రూ.14,956, మర మగ్గాలపై ఆధారపడిన కుటుంబాలకు నెలకు రూ.2,717 చొప్పున ఏటా రూ.32,604 మేర లబ్ధి చేకూరనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.189.62 కోట్లు కేటాయించింది. మరోవైపు చేనేత కార్మికులకు భారంగా మారిన జీఎస్టీని ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది. 2017 నుంచి చేనేత వస్త్రాలపై కేంద్రం 5శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. దీనిపై చేనేత వర్గాలు పలుమార్లు వినతులిచ్చినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ భారం భరిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏటా రూ.15 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మూడో పథకం త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5కోట్ల చొప్పున విడుదల చేయనుంది. చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
నేడు మంగళగిరి ‘వీవర్ శాల’కు సీఎం
గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంత్రి లోకేశ్ సహకారంతో గతంలో ఏర్పాటైన ‘వీవర్ శాల’ (మంగళగిరి హ్యాండ్లూమ్ డెవల్‌పమెంట్ సెంటర్)ను ఆయన సందర్శిస్తారు. అక్కడున్న మగ్గాలు, చేనేత వస్త్రాలను పరిశీలించి, మార్కెటింగ్ అవకాశాలపై చేనేత కళాకారులతో సంభాషిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. నేతన్నల కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు ప్రసంగిచనున్నారు. కాగా, మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్పష్టత లేక సందిగ్ధం
ఉచిత విద్యుత్తు అమలుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో సందిగ్ధత నెలకొంది. అద్దె ఇళ్లలో ఉండే చేనేత కార్మికుల విషయంలో ఇంటి యజమాని పేరిట కరెంటు బిల్లు వస్తుందని, ఈ సమస్యను ఎలా అధిగమిస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వమే సచివాలయాల ద్వారా చెల్లిస్తుందా? లే దా విద్యుత్తు శాఖకు నిధులు విడుదల చేస్తుం దా? హ్యాండ్లూమ్స్ విభాగం ద్వారా ఇస్తారా? అ నే చర్చ చేనేత సంఘాలతో పాటు అధికారుల్లో నూ జరుగుతోంది. అదేవిధంగా జీఎస్టీ చెల్లింపులపైనా సందిగ్ధత కొనసాగుతోంది. ఆప్కో షో రూమ్‌ల్లో సొసైటీలు విక్రయించే చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు జీఎ్‌సటీ చెల్లిస్తారు. మరి నేతన్నకు 5శాతం ఎలా చెల్లిస్తారు? కేవ లం సొసైటీల్లోని సభ్యులకు మాత్రమే చెల్లిస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని వారికి అన్యాయం జరుగుతుంది. ఈ ఆరు జిల్లాల్లో కనీసం పది శాతం సొసైటీలు కూడా లేవు. చేనేత కార్మికుడికి జీఎ్‌సటీ చెల్లింపుపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి త్రిఫ్ట్ ఫండ్ రూ. 58 లక్షలు మాత్రమే కేటాయించగా ఈ రోజు కూ బిల్లులు రాలేదని చేనేతలు వాపోతున్నారు.