AP Govt: మరో 31 నామినేటెడ్ పదవుల భర్తీ
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:33 AM
ఎట్టకేలకు మరో విడత నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 31 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం జాబితా విడుదల చేసింది.
ఓసీలకు 6, బీసీలకు 18, ఎస్సీలకు 4,ఎస్టీకి ఒకటి, మైనార్టీలకు రెండు పదవులు
టీడీపీకి 25, జనసేనకు 3, బీజేపీకి 2
అమరావతి బహుజన జేఏసీకి ఒక పదవి
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మరో విడత నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 31 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అమరావతి బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)కి ఒక పదవి దక్కింది. ఈ ఏడాది మేలో భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో అమరావతి జేఏసీకి రెండు పదవులు ఇచ్చారు. ప్రస్తుతం భర్తీచేసిన 31 పదవుల్లో టీడీపీకి 25, జనసేనకి 3, బీజీపీకి 2, అమరావతి బహుజన జేఏసీకి ఒకటి దక్కాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. బీసీలకు అత్యధికంగా 18 పదవులు దక్కాయి. ఎస్సీలకు నాలుగు, మైనార్టీలకు రెండు, ఎస్టీలకు ఒకటి కేటాయించారు. గతేడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తొలి విడతగా సెప్టెంబరు 24న నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. 2024 నవంబరులో 59 కార్పొరేషన్లకు, 2025 మే 11న మరో 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తాజా నియామకాలతో కలిపి ఇప్పటివరకు 132 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినట్లయింది.