Toll Collection Wont Burden Common Public: సామాన్యులపై భారం ఉండదు
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:02 AM
నీతి ఆయోగ్ సూచనల మేరకే రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షి్‌ప(పీపీపీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో రహదారి ప్రాజెక్టులు చేపడుతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు..
స్టేట్ హైవేలపై నిర్దిష్ట ప్రమాణాల మేరకు టోల్ గేట్లు
టోల్ వసూళ్లపై మరింత కసరత్తు జరుగుతోంది
ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్ సూచనల మేరకే రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షి్‌ప(పీపీపీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో రహదారి ప్రాజెక్టులు చేపడుతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు విభాగాల పనుల్లో నిర్మించి, అభివృద్ధి చేసే స్టేట్ హైవేలపై నిర్దిష్ట ప్రమాణాల మేరకే టోల్‌గేట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సామాన్యులపై భారం పడకుండా టోల్ వసూలు చేస్తారని, దీనిపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల ఆటోలు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు వంటివాటిపై ఆ టోల్ ఉండదని, కార్లు, రవాణా లారీలు, ఇతర భారీ వాహనాలపైనే టోల్ ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుతో కలిసి మంగళవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. హ్యామ్ కింద చేపట్టే రోడ్లపై జగన్ పత్రిక కథనాలపై మంత్రి మండిపడ్డారు. రోడ్డెక్కితే బాదుడే అన్న కథనాలు అవాస్తవమని చెప్పారు. గత ప్రభుత్వ పాపాల వల్లే రాష్ట్రంలో రహదారులకు దుర్గతి పట్టిందని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో ఒక్క రోడ్డు వేయలేదని, ఉన్న రోడ్లకు నిర్వహణ లేదన్నారు. ఫలితంగా ఆర్‌అండ్‌బీపై ఇప్పుడు భారం పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20,104 కి.మీ. రహదారుల నిర్వహణ చేపట్టామని, గుంతలు పూడ్చేందుకు రూ.3,342 కోట్లు వ్యయం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గుంతలు పూడ్చేందుకు రూ.860 కోట్లు వ్యయం చేశామన్నారు. ఇటీవల తుఫానుల వల్ల దెబ్బతిన్న రోడ్లపై గుంతలను జనవరి నాటికి, నిర్వహణ పనులను మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు.
పరిస్థితులు బట్టి పాలసీలో మార్పు: కృష్ణబాబు
హ్యామ్‌లో చేపట్టే రహదారి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం ఉంటుందని కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వ వాటాలో కేంద్రానికి 20 లేదా 30 శాతం ఉంటుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. కాంట్రాక్టర్ 60 శాతం వాటా ప్రభుత్వం 15 వార్షిక ఇన్‌స్టాల్‌మెంట్ల కింద చెల్లిస్తుందని వివరించారు. రాష్ట్ర హైవేలపై టోల్ వసూలు చేయాలన్న పాలసీ గత ప్రభుత్వ హయాంలో 2022లోనే వచ్చిందని చె ప్పారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాలసీలో ఏ మార్పులు తీసుకురావాలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. హ్యామ్‌లో తొలి దశలో 1,500 కి.మీ. రహదారి నిర్మాణం ఉంటుందన్నారు. ఇందులో సగటున ఒక్కో కి.మీ. నిర్మాణం కోసం రూ. 5 కోట్లమేర ఖర్చు అవుతుందని చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 1 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలపై జీఎస్టీ భారం తగ్గినందున, ఆ మేరకు హ్యామ్ ప్రాజెక్టులకు రహదారి భద్రత కింద 10 శాతం సుంకం వసూలు చేయాలని ప్రతిపాదించినట్లుగా కృష్ణబాబు అంగీకరించారు. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.