Share News

AP Govt: అప్పు తెచ్చి బకాయిల చెల్లింపు

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:37 AM

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సరికొత్త ఆలోచన చేస్తోంది. దాదాపు రూ.3,500 కోట్ల వరకు ఉన్న పెండింగ్‌ బకాయిల మొత్తాన్ని...

AP Govt: అప్పు తెచ్చి బకాయిల చెల్లింపు

  • నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఒకేసారి చెల్లించేందుకు

  • రూ.3 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం నిర్ణయం

  • ‘ఆషా’ ప్రతినిధులతో జరిగిన భేటీలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో వెల్లడి

  • ఆందోళన విరమణకు ఆస్పత్రుల అంగీకారం!

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సరికొత్త ఆలోచన చేస్తోంది. దాదాపు రూ.3,500 కోట్ల వరకు ఉన్న పెండింగ్‌ బకాయిల మొత్తాన్ని ‘వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌’ కింద చెల్లించాలని భావిస్తోంది. ఇందు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ గురువారం ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (ఆషా) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. చర్చల్లో భాగంగా సీఈవో కీలక విషయాలు వారికి తెలిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనే నిర్ణయం తీసుకుందని, అయితే రుణం రావడానికి 3-4 నెలల వ్యవధి పడుతుందని తెలియజేశారు. వచ్చిన వెంటనే బకాయిలు మొత్తం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒకేసారి బకాయిల మొత్తం క్లియర్‌ చేసేందుకు ప్రభుత్వం ఆంగీకరించడంతో ఆషా ప్రతినిధులు సమ్మె విరమణకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ఆషా జనరల్‌ బాడీ సమావేశంలో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. మరోవైపు తాత్కాలిక ఉపశమనం కింద వెంటనే ఆస్పత్రులకు రూ.250 కోట్లు విడుదల చేయాలని ఆషా ప్రతినిధులు కోరారు. ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేశామని, మరో రూ.250 కోట్లు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ట్రస్ట్‌ అధికారులు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె విరమణ నిర్ణయం ఉండనుంది.


1-2 నెలలకోసారి 250 కోట్లు చెల్లిస్తున్నా..

ప్రభుత్వం ఒకవైపు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 1-2 నెలలకోసారి రూ.250 కోట్ల వరకూ చెల్లింపులు చేస్తోంది. అయినా రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు అలానే ఉంటున్నాయి. పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం బంద్‌, సమ్మె, ఆందోళనలు అంటూ హడావుడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణం తీసుకొని, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లింపులు చేయాలని నిర్ణయించినట్లు ట్రస్ట్‌ సీఈవో పేర్కొన్నారు. తీసుకొన్న రుణాన్ని బ్యాంకుకు ప్రతినెలా కొంత మొత్తం లెక్కన చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

శస్త్ర చికిత్సల ప్యాకేజీలు పెంచండి..

మరోవైపు ప్రభుత్వం ప్రజలకు బీమా కల్పించే దిశగా వెళ్తున్న నేపథ్యంలో శస్త్ర చికిత్సల ప్యాకేజీలు పెంచాలని ఆషా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ట్రస్ట్‌ ప్రారంభించిన తర్వాత కేవలం ఒకటి, రెండుసార్లు మాత్రమే ప్యాకేజీలు పెంపు చేపట్టారని, ఇప్పుడు ఆ ప్యాకేజీలతో ఇన్సూరెన్స్‌లో వైద్య సేవలు అందించలేమని ట్రస్ట్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అధికారులు తెలిపారు.

Updated Date - Oct 31 , 2025 | 04:38 AM