AP Govt: అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:45 AM
రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
గనుల శాఖకు సీఎం ఆదేశం.. ఇసుక రీచ్‌లలో డ్రోన్, శాటిలైట్ నిఘా పెట్టాలి
6 జిల్లాల్లో సంతృప్త స్థాయి ఎందుకు తగ్గింది?.. మీరంతా ఏం చేస్తున్నారని ఆగ్రహం
రవాణాదారులు ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న అధికారులు
అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోండి.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వండి
గనుల శాఖా నిరంతరం పర్యవేక్షించాలి.. వాహనాలను సీజ్ చేసి కేసులు పెట్టండి
ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్.. విశాఖలో క్రిటికల్ మినరల్ క్లస్టర్‌కు ఓకే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇసుక పంపిణీ, రవాణా వంటి కీలక అంశాల్లో ప్రభుత్వ కృషికి తగినట్లుగా ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరగాలని దిశానిర్దేశం చేశారు. ఉచితం పేరిట కొన్ని చోట్ల అక్రమార్కులు ఇసుకను దారి మళ్లిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నందున.. నిరంతరం రీచ్‌లపై డ్రోన్, శాటిలైట్ వ్యవస్థలతో నిఘాపెట్టాలని స్పష్టంచేశారు. రీచ్ ల నుంచి అక్రమంగా ఇసుకను తవ్వితీసేవారిపైన, గృహావసరాల కోసమంటూ తీసుకున్న ఇసుకను బ్లాక్‌మార్కెట్ చేసేవారిపైన ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. గనుల శాఖపై మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గనుల శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఇసుకకు సంబంధించిన పీపీపీ విధానం (రీచ్, డిపోలో ప్రైవేటు విక్రయాలు)పై ఆరు జిల్లాల్లో ప్రజల సంతృప్త స్థాయి బాగా త గ్గింది. ఆర్‌టీజీఎస్ నిర్వహించిన సర్వేల్లో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 49.7 శాతం, నెల్లూరు-50.4శాతం, గుంటూరు-56.4శాతం, కృష్ణా-59.2శాతం, శ్రీకాకుళం-60.9శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 63.4 శాతమే సంతృప్త స్థాయి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని సీఎం అధికారులను ప్రశ్నించారు. లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని అడిగారు. ఇసుక స్టాక్ పాయింట్లు మూసివేయడం ఒక కారణమని గనుల శాఖ అధికారి ప్రవీణ్ నివేదించారు. ఇదొక్కటే కారణంలా కనిపించడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
దాంతో అధికారులు అసలు విషయం నివేదించారు. ఇసుక పంపిణీకి ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. వారానికి ఒక్కరికి ఒక ట్రిప్పేనంటూ రవాణాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇంత జరుగుతుంటే జిల్లాల్లో గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని సీఎం నిలదీశారు. తక్షణమే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఉమ్మడి గోదావరి, ప్రకాశం, కడప జిల్లాల్లో అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ బాగున్నాయని గనుల అధికారులు నివేదించగా.. ఇదే పని సంతృప్త స్థాయి తగ్గిన ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.
అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు..
ప్రజల నుంచి అత్యధిక చార్జీలు వసూలు చేసే రవాణాదారులు, డిపో ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని సీఎం స్పష్టంచేశారు. బీచ్‌శాండ్ మైనింగ్ నేపథ్యంలో విశాఖలో క్రిటికల్ మినరల్ క్లస్టర్ (సీఎంసీ)ను ఏర్పాటు చేయాలన్న గనుల శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీనివల్ల పెద్దఎత్తున కంపెనీలు ముందుకొస్తాయని అధికారులు తెలిపారు.
ఇసుక కొరత రావొద్దు..
రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టి, కంకర మొదలైనవాటికి కొరత లేకుండా పక్కా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. సీఆర్‌డీఏ పనులు చేసే కాంట్రాక్టర్లు క్వారీ లీజుల కోసం వెంటనే దరఖాస్తులు చేసుకోవలసి ఉందని అధికారులు తెలిపారు.