SC Welfare Committee: ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:28 AM
ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ సంక్షేమ శాసనసభ కమిటీ అధ్యక్షుడు కుమార్‌రాజా వర్ల స్పష్టం చేశారు.
ఏపీ శాసనసభ కమిటీ అధ్యక్షుడు కుమార్ రాజా
అనంతపురం కలెక్టరేట్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ సంక్షేమ శాసనసభ కమిటీ అధ్యక్షుడు కుమార్‌రాజా వర్ల స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన కమిటీ నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆ సామాజికవర్గ ప్రజలు, నేతల నుంచి అర్జీలను స్వీకరించింది. అనంతరం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీ్‌షతో కలిసి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కుమార్‌రాజా మాట్లాడుతూ... షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలను మినిట్స్ రూపంలో శాసనసభకు అందజేస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసుల స్థితి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తీరు తదితర అంశాలపైనా నివేదికలు అందజేస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అట్రాసిటీ చట్టం లక్ష్యం నెరవేరేలా పోలీసులు పనిచేయాలని, ఒత్తిళ్లకు తలొగ్గరాదని కమిటీ సభ్యుడు ఎంఎస్ రాజు సూచించారు.