AP Govt: క్వాంటమ్ బొనాంజా
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:34 AM
రాష్ట్ర భవిష్యత్తును మార్చనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సానుకూల వాతావరణం సృష్టించేలా కీలక ముందడుగు పడింది.
రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించే దిశగా చర్యలు
పరిశోధనలు, హార్డ్‌వేర్ పార్కులు, స్టార్ట్‌పలకు ప్రోత్సాహం
ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి ఆమోద ముద్ర
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తును మార్చనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సానుకూల వాతావరణం సృష్టించేలా కీలక ముందడుగు పడింది. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో పరిశోధనలు, అధ్యయనాలు, అవగాహన, పాఠ్య ప్రణాళిక, హార్డ్‌వేర్ పార్కుల అభివృద్ధి, స్టార్ట్‌పల ఏర్పాటును ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని క్యాబినెట్ సోమవారం ఆమోద ముద్ర వేసింది. రాజధాని అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది జనవరి 1న క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆలోగా ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను వేగంగా విస్తరించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ త్వరలోనే అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్స్ నుంచి రాష్ట్రానికి రానుంది. అమరావతిలో 90 లక్షల చదరపు అడుగుల్లో క్వాంటమ్ హబ్‌ను నిర్మించేలోగా ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ‘విట్’ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన భవంతిలో ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సుమారు 80 వేల మంది పనిచేసేందుకు వీలుగా క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ (టవర్) నిర్మాణం జరుగుతుంది. అలాగే 100 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ పార్కును నిర్మిస్తారు. ఈ క్వాంటమ్ వ్యాలీలో ప్రతియేటా క్వాంటమ్ కంప్యూటింగ్ ఈవెంట్లు, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై హ్యాకథాన్ నిర్వహిస్తారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా అకడమిక్ రిసెర్చ్‌తోపాటు విద్యాసంస్థల్లో బోధించేలా క్వాంటమ్ కంప్యూటింగ్ పాఠ్య ప్రణాళికలను రాష్ట్రమంతా అమలు చేస్తారు. వీటి కోసం కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇవీ ప్రోత్సాహకాలు
క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన విభాగంలో ఎంపిక చేసిన స్టార్ట్‌పలు, అకడమిక్ ప్రాజెక్టులకు రూ.30 లక్షల దాకా ప్రోత్సాహకాలు అందిస్తారు. లేదా 1:1 మ్యాచింగ్ గ్రాంట్‌ను అందజేస్తారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లలో పరిశోధనల అభివృద్ధి కోసం సీడ్ ఫండింగ్ కింద రూ.కోటి వరకు అందిస్తారు. మార్కెటింగ్ సపోర్టు కింద క్వాలిటీ షేరింగ్ విధానంలో రూ.5 లక్షల వరకూ ఇస్తారు.
ఇంటర్వెన్షన్ ఐపీ సపోర్టు కింద 75శాతం రీయింబర్స్‌మెంట్ లేదా దేశీయ సంస్థలకు రూ.4 లక్షల వరకూ, విదేశీ సంస్థలకు రూ.20 లక్షల వరకూ అకడమిక్ రిసెర్చ్ సపోర్టు ఉంటుంది.
గుర్తింపు పొందిన క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్‌స్టేషన్లకు అద్దె సబ్సిడీ. మార్కెటింగ్ సపోర్టు కింద రూ.10 లక్షల వరకూ రీయింబర్స్ చేస్తారు.
క్వాంటమ్ హార్డ్‌వేర్ పార్కులు ఏర్పాటు చేసేందుకు సంస్థల సామర్థ్యం, పెట్టుబడి ఆధారంగా భూ కేటాయింపుల్లో రాయితీలు అందిస్తారు.
ముందుగా ఏర్పాటు చేసే పది హార్డ్‌వేర్ పార్కులకు ఎర్లీబర్డ్ పథకం కింద 50 శాతం క్యాపిటల్ సబ్సిడీని రెండేళ్ల వరకూ అందిస్తారు. ఈ సబ్సిడీ రూ 50 కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థలకు వర్తిస్తుంది. రూ.50కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సంస్థలకు ఐదేళ్లపాటు 30 శాతం క్యాపిటల్ సబ్సిడీ అందిస్తారు.
హర్డ్‌వేర్ పార్కుల్లో పనిచేసే పూర్తి నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు నెలకు రూ.30,000, సెమీస్కిల్డ్ వారికి రూ.15,000 ఆరు నెలలపాటు రిక్రూట్‌మెంట్ అసిస్టెన్స్ కింద అందిస్తారు. ఐదేళ్లపాటు పన్ను రాయితీ ఉంటుంది. ఐదేళ్ల పాటు విద్యుత్ యూనిట్ ఒక రూపాయికే సరఫరా చేస్తారు. క్వాంటమ్ హర్ట్‌వేర్ పార్కులకు స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు ఉంటుంది.
రూ.10 కోట్ల పెట్టుబడితో క్వాంటమ్ హార్డ్‌వేర్ పార్కులను స్థాపించే సంస్థలకు వర్క్‌స్టేషన్లలో రూ.10,000 దాకా ఐదేళ్లపాటు రెంటల్ సబ్సిడీ వర్తిస్తుంది.
ఐటీ హార్డ్‌వేర్‌లో 50శాతం సబ్సిడీ గరిష్ఠంగా రూ.10 కోట్ల దాకా వర్తిస్తుంది. 50 శాతం క్యాపిటల్ సబ్సిడీ, దిగుమతి సుంకంలో రాయితీ రూ.10 కోట్ల దాకా వర్తిస్తుంది. వాణిజ్య పన్నుల్లో రాయితీ రూ.6లక్షల వరకూ ఉంటుంది.