Share News

AP Govt: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీల నియామకం

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:55 AM

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్‌) ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతమున్న అధికార పర్సన్‌ ఇన్‌చార్జి స్థానంలో అధికారేతర పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమిస్తోంది.

AP Govt: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీల నియామకం

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్‌) ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతమున్న అధికార పర్సన్‌ ఇన్‌చార్జి స్థానంలో అధికారేతర పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమిస్తోంది. ఈ మేరకు మంగళవారం పీఏసీఎ్‌సలకు త్రిసభ్య కమిటీలను నియమిస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య కమిటీలో ఒకరు చైర్‌పర్సన్‌గా, ఇద్దరు సభ్యులుగా నియమితులయ్యారు. జూలై 30 వరకు గడువున్న 468 పీఏసీఎ్‌సలకు, అక్టోబరు 30 వరకు గడువున్న 23 పీఏసీఎ్‌సలకు అధికార పర్సన్‌ ఇన్‌చార్జిలను తొలగించి, త్రిసభ్య కమిటీలను నియమించింది. కాగా వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టంలోని కమిషన్‌ ఏజెంట్ల లైసెన్సులకు సంబంధించి సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం తాజాగా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే కమిషన్‌ ఏజెంట్లు వారి అంచనా వేసిన వార్షిక టర్నోవర్‌ను ప్రకటించి, బ్యాంక్‌ గ్యారెంటీని సమర్పించాలని ఆదేశించింది. ఏడాది పొడవునా వాస్తవ టర్నోవర్‌... ప్రకటించిన మొత్తానికి మించి ఉంటే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నుంచి నోటీస్‌ అందిన వెంటనే అదనపు బ్యాంక్‌ గ్యారెంటీని సమర్పించాలి. లేకపోతే లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉందని ఈ సవరణ ఉత్తర్వుల్లో పేర్కొంది.

జీవ వైవిధ్య బోర్డులో ఎక్స్‌అఫీషియో సభ్యుల నియామకం

ఎక్స్‌అఫీషియో సభ్యులతో రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది. వివిధ శాఖలకు చెందిన 8 మంది ఉన్నతాధికారులను బోర్డులో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నియమించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో నీరు, గాలి, పర్యావరణ నమూనాల విశ్లేషణ చార్జీలను వివరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jul 09 , 2025 | 06:57 AM