Dussehra Aid for Auto and Cab Drivers: ఆటో డ్రైవర్లకు దసరా కానుక
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:30 AM
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించడానికి రంగం సిద్ధమైంది. వీరికి ఒక్కొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున..
15 వేలు చొప్పున సాయం
17 నుంచి దరఖాస్తుల స్వీకరణ
1న అర్హుల ఖాతాల్లో నగదు జమ
ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
24న తుది జాబితా సిద్ధం
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించడానికి రంగం సిద్ధమైంది. వీరికి ఒక్కొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో, క్యాబ్ యజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్నవారు అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రవాణా శాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ఈ నెల 13 నాటికి ఉన్న పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు 17 నుంచి 19వ తేదీ వరకూ అవకాశం కల్పించింది. క్షేత్ర పరిశీలన 22లోపు పూర్తిచేసి 24న తుది జాబితా సిద్ధం చేస్తారు. అర్హులైన లబ్ధిదారులకు అక్టోబరు 1న సీఎం చంద్రబాబు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తారని ఉత్తర్వుల్లో తెలిపారు. బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి అటో, క్యాబ్ డ్రైవర్లకు డబ్బులు చెల్లిస్తారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేశారు. దీనివల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందంటూ ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.435 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
ఎవరికి వర్తిస్తుందంటే..
ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. ఆధార్, తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే నగదు జమ చేస్తారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా పథకానికి అర్హులు కాబోరని ప్రభుత్వం స్పష్టం చేసింది.