AP Govt: యూరియా కొరతపై ప్రభుత్వం దృష్టి
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:10 AM
రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టులో లక్షా 65వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 65వేల టన్నులు వచ్చింది.
రాష్ట్రానికి రావాల్సింది లక్షా 50 వేల టన్నులు
దీనికోసం కేంద్రంతో నిరంతర సంప్రదింపులు
10 రోజుల్లో 31,632 టన్నుల రాక!
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టులో లక్షా 65వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 65వేల టన్నులు వచ్చింది. ఇంకా లక్ష టన్నులు రావాల్సి ఉంది. జూలైలోనూ 50వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు పుంజుకుంది. దీంతో యూరియాకు డిమాండ్ వచ్చింది. మరోవైపు ఐపీఎల్, సీఐఎల్ నౌకలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైంది. అందువల్ల కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నెల 25న నౌకలపై గంగవరం పోర్టుకు వచ్చే 18వేల టన్నుల్లో సరుకు మొత్తం ఇవ్వాలని, 28న కాకినాడ పోర్టుకు రానున్న 42వేల టన్నుల్లో కనీసం 25వేల టన్నులు ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు గురువారం రాత్రి ’ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. గంగవరం, కాకినాడ పోర్టుకు రావల్సిన నౌకలు.. విపత్తుల వల్ల ఆలస్యమైతే ఇబ్బంది లేకుండా ఈ నెల 23న ధమ్రా(ఒడిశా) పోర్టుకు వచ్చే ఐపీఎల్ యూరియాను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖను కోరారు. ఈ నెల 24న కరైకల్(పాండిచ్చేరి) పోర్టుకు వచ్చే 8,100 టన్నుల సీఐఎల్ యూరియాలో 7,800 టన్నులు 26, 27 తేదీల్లో విజయనగరం, ద్వారపూడి, కేసీ కెనాల్, తాడేపల్లిగూడెం, గుడివాడ, నంద్యాలకు చేరనుంది. రానున్న 10 రోజుల్లో రాష్ట్రానికి 31,632 టన్నుల యూరియా వస్తుందని అధికారులు చెప్తున్నారు.