AP Government: ఎస్ర్కో ఖాతాల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:16 AM
పరిశ్రమలకు ఎస్ర్కో ఖాతాల ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకాలను చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినందున పారిశ్రామికవేత్తలు నిస్సంకోచంగా రాష్ట్రంలో...
రాష్ట్రంలో నిస్సంకోచంగా పెట్టుబడులు పెట్టండి
పారిశ్రామికవేత్తలకు మంత్రులు కొలుసు, కొండపల్లి పిలుపు
ఏపీ చాంబర్స్ ‘బిజినెస్ ఎక్స్‌పో-2025’ బ్రోచర్ ఆవిష్కరణ
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు ఎస్ర్కో ఖాతాల ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకాలను చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినందున పారిశ్రామికవేత్తలు నిస్సంకోచంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవచ్చని సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రానికి ఇప్పటికే రూ.9 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు గ్రౌండింగ్ కాగా.. సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరో 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వివరించారు. ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో విజయవాడలో ‘బిజినెస్ ఎక్స్‌పో-2025’ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. మంత్రి పార్థసారథితో పాటు ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎపీఎన్‌ఆర్టీఎస్ చైర్మన్ డాక్టర్ రవి వేమూరు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిజినెస్ ఎక్స్‌పో బ్రోచర్‌ను, ఏవీ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో-2025ను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, మాజీ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.