Rat Attacks in Medical College Hostels: మెడికోలపై ఎలుకల దాడి..ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:17 AM
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులపై జరిగిన ఎలుకల దాడి ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు...
ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో కాంట్రాక్టర్, వార్డెన్లకు షోకాజు నోటీసులు
మెడికల్ కాలేజీ హాస్టళ్లను పరిశీలించిన ప్రిన్సిపాల్
ఎలుకలను పట్టేందుకు బోన్లు, గమ్‌ప్యాడ్లు ఏర్పాటు
అమరావతి/ఏలూరు క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులపై జరిగిన ఎలుకల దాడి ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీ (పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ సర్వీసె్‌స)కి నోటీసులు జారీచేయాలని డీఎంఈ డా.రఘునందనరావును ఆదేశించారు. ఎలుకల దాడి ఘటనపై విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సృష్టం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మెడికల్ కాలేజీ బాలికల హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థులను ఎలుకలు గాయపరిచిన ఘటనకు సంబంధించి ‘మెడికోలపై ఎలుక దాడి’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఆదేశాల నేపథ్యంలో సదరు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు సంస్థ వివరణ కోరుతూ డీఎం షోకాజ్ నోటీసు ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ల వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. వసతి గృహాల్లోని పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో.. ప్రిన్సిపాల్ డాక్టర్ సావిత్రి, ఏలూరు ప్రభుత్వాసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ కృష్ణ, పలువురు అధికారులు హాస్టళ్లను పరిశీలించారు. కొత్త భవన నిర్మాణాల శబ్దాలతో పాటు చెట్లు, మొక్కలు, తుప్పలు తీసివేయడంతో ఆ ప్రాంతాల్లో ఉండే ఎలుకలు హాస్టల్‌లోకి వస్తున్నట్లుగా గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, గత రెండు రోజుల వ్యవధిలో ఎలుకలు హాస్టల్‌లోని ఏడుగురు విద్యార్థులను కరిచాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎలుకలు రావడానికి ఆస్కారం ఉన్న రంధ్రాలను పూడ్పించారు. హాస్టల్‌లో పలుచోట్ల 25 గమ్‌ప్యాడ్‌లు, 15 ఎలుక బోన్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకల్లా హాస్టళ్లలో చెత్త బుట్టలను ఖాళీ చేసి, ఫినాయిల్‌తో శుభ్రం చేయాలని, ఎలుకలు రాకుండా రసాయనాలు స్ర్పే చేయాలని సిబ్బందికి ప్రిన్సిపాల్ సావిత్రి ఆదేశించారు.