Human Resource Development Dept: ఇంటర్‌లో వసూళ్లపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:54 AM
ఇంటర్మీడియట్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ పోస్టుల క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లకు తెరదీసిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఉలిక్కిపడిన లెక్చరర్లు
వారం కిందటే అధికారుల దృష్టికి.. అంతర్గత విచారణ మొదలు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ పోస్టుల క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లకు తెరదీసిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. క్రమబద్ధీకరణ అంశం పెండింగ్‌లోనే ఉన్నప్పటికీ.. దీనిని తాము ముందుకు తీసుకెళ్తామంటూ కొందరు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లే వసూళ్లకు దిగారు. ఈ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం వెలుగులోకి తీసుకొచ్చింది. కాగా, వారం కిందటే దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు అప్పుడే అంతర్గత విచారణ మొదలుపెట్టారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించడంతో వసూళ్లకు దిగిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ఉలిక్కిపడ్డారు. వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాలేజీల నుంచి వసూలు చేసిన మొత్తాలను జిల్లాల వారీగా ఏజెంట్లు ఒక ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. ఈ వసూళ్లకు సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు సేకరించినట్లు తెలిసింది.
వసూళ్లు అవాస్తవం: సంఘాలు
వసూళ్ల అంశంపై ఇంటర్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘాలు శుక్రవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. క్రమబద్ధీకరణ విషయంలో తమకు ఇన్నాళ్లకు న్యాయం జరుగుతుంటే కొందరు అడ్డుపడుతున్నారని, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2000 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన క్రమబద్ధీకరణకు అడ్డుపడొద్దని కోరారు. సుదీర్ఘకాలంగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న తమకు న్యాయం చేయాలన్నారు.