Chevireddy Family Assets in Liquor Scam: చెవిరెడ్డి ఆస్తులు జప్తు
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:57 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం జప్తు చేసింది. మద్యం ముడుపుల సొమ్ముతో అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని....
మద్యం స్కాంలో 63.72 కోట్ల స్థిరాస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి
మద్యం ముడుపుల సొమ్ముతో కొనుగోలు
వైట్ మనీగా మార్చుకోవడానికి కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో
9 డొల్ల కంపెనీల సృష్టి!
ఏసీబీ కోర్టులో త్వరలో సిట్ పిటిషన్
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం జప్తు చేసింది. మద్యం ముడుపుల సొమ్ముతో అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇటీవల పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన రూ.63.72కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేస్తూ రాష్ట్ర హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయించిన పలు ఆస్తులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు.. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ-38), ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(ఏ-39), చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పేర్లతో రిజిస్టరై ఉన్న స్థిరాస్తుల వివరాలు వెల్లడించింది. సబ్ రిజిస్ర్టార్ విలువ ప్రకారం రూ.8.85 కోట్లు మాత్రమే చూపించి.. మిగతా రూ.54.87 కోట్లను నగదు రూపంలో చెల్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ తేల్చింది. చెవిరెడ్డి కుటుంబం భారీగా మోసపూరిత భూ లావాదేవీలు చేసిందని, ఆలయ పూజారిని సైతం వదిలి పెట్టకుండా ఆస్తులు రాయించుకుందని తెలిపింది. మద్యం కుంభకోణంలో కమీషన్లు తీసుకుని.. ఆ డబ్బులతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్మును.. ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు వైసీపీ అభ్యర్థులకు పంపగా.. అందులో సింహభాగం వెనకేసుకున్న చెవిరెడ్డి అక్రమ సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికి కుటుంబ సభ్యులు, అనుచరులు, డ్రైవర్, సహాయకుడు, బంధువులు, ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండే వారి పేర్లతోనూ 8 డొల్ల కంపెనీలు సృష్టించి లావాదేవీలు జరిపినట్లు సిట్ వెల్లడించింది. ఇందులో కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీగా ఉన్న కుమారుడు మోహిత్‌రెడ్డి, సీఎంఆర్ ఇన్‌ఫ్రా పేరుతో ఉన్న కంపెనీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో కుమారుడు హర్షిత్‌రెడ్డి పేరుతో ఉన్న ఆస్తుల్లో రూ.54.87 కోట్లు లెక్కల్లో చూపలేదంది. నెల్లూరు జిల్లాలో అరబిందో ఫార్మాకు విక్రయించిన 263 ఎకరాల భూమికి సంబంధించి కేవీఎస్ ఇన్ ఫ్రా ద్వారా 13.3 కోట్ల రూపాయలు వైట్ మనీగా మార్చినట్లు గుర్తించింది. దీంతో వందల ఎకరాల భూములు.. ఖరీదైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య స్థలాలను జప్తు చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడానికి సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సిట్ కోర్టులో త్వరలో జప్తు పిటిషన్ దాఖలు చేయబోతోంది.