Share News

Electricity Bill Relief: షాక్‌లకు చెక్

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:38 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్తు వినియోగదారులపై మోపిన భారం అక్షరాలా రూ.32,166 కోట్లు. ట్రూఅప్‌ చార్జీలు.. ఇంధన సర్దుబాటు చార్జీలు((ఎఫ్‌పీపీసీఏ)...

Electricity Bill Relief: షాక్‌లకు చెక్

  • ట్రూఅప్‌ల నుంచి ట్రూడౌన్‌లోకి రాష్ట్రం

  • యూనిట్‌కు 13 పైసలు ఊరట.. వినియోగదారులకు 923 కోట్లు వాపస్‌

  • వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితమిది

  • వైసీపీ హయాంలో అడ్డగోలు కొనుగోళ్లు

  • అవినీతికి అడ్డాగా విద్యుత్‌ రంగం

  • ఫలితంగా తొమ్మిది సార్లు చార్జీల పెంపు

  • ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులపై రూ.32 వేల కోట్ల భారం

  • విద్యుత్తు సంస్థలూ అప్పులఊబిలోనే..

  • నాడు ట్రూడౌన్‌ను పంచుకున్న డిస్కమ్‌లు

  • నేడు ప్రజలకు తిరిగిచ్చేయాలని నిర్ణయం

  • ఈఆర్‌సీ చరిత్రలోనే ఇది తొలిసారి

  • జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ

ఐదేళ్లూ జనాన్ని బాదిన జగన్‌... ఇప్పుడు విద్యుత్‌ ‘చార్జీల ట్రూడౌన్‌’ను జీర్ణించుకోలేకపోతున్నారు. ‘అబ్బే... ఇది చంద్రబాబు గొప్పకాదు! విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ఈఆర్‌సీ షాక్‌ ఇచ్చినందుకే తగ్గించారు’ అని జగన్‌ రోత పత్రిక వింత కథలు చెప్పింది. జగన్‌ హయాంలో ట్రూడౌన్‌ లబ్ధి ప్రజలకు ఎందుకు చేరలేదు? ఈ ప్రశ్నకు మాత్రం జగన్‌ పత్రిక సమాధానం చెప్పలేదు. ఈఆర్సీ ఆదేశాల ప్రకారమే చార్జీల వసూలు ఉంటుంది. జగన్‌హయాంలో డిస్కమ్‌లు ఉజ్జాయింపు వ్యయం చూపిస్తూ... ఏటా యూనిట్‌కు 40 పైసల చొప్పున ట్రూఅప్‌ ప్రతిపాదించడం, ఈఆర్సీ ఆమోదించడం జరుగుతూ వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. జగన్‌ హయాంలో ఎడాపెడా విద్యుత్‌ కొనుగోళ్ల ఫలితంగా 40 పైసలకు మించే ఖర్చయిందని చెబుతూ, మరింతగా ట్రూ అప్‌ బాదుడు బాదేవాళ్లు. 2024-25 ట్రూ అప్‌ ప్రతిపాదనలను జగన్‌ హయాంలోనే ఈఆర్సీకి సమర్పించారు. దాని ప్రకారమే వసూళ్లు జరిగాయి. కానీ... కూటమి సర్కారు వచ్చాక విద్యుత్‌ కొనుగోళ్లలో అనుసరించిన హేతుబద్ధత కారణంగా వ్యయం తగ్గింది. దీని ఫలితమే.. యూనిట్‌కు 13 పైసల చొప్పున ‘ట్రూ డౌన్‌’! ప్రజలపై భారం తగ్గడం నిజం! ఇందులో ప్రభుత్వానికి ‘షాక్‌’ కనిపించడం రోత పత్రిక నైజం!

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్తు వినియోగదారులపై మోపిన భారం అక్షరాలా రూ.32,166 కోట్లు. ట్రూఅప్‌ చార్జీలు.. ఇంధన సర్దుబాటు చార్జీలు((ఎఫ్‌పీపీసీఏ)...పేరు ఏదైనా లక్ష్యం ప్రజల నడ్డి విరవడమే.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలోనే విద్యుత్తు చార్జీల బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఈ లబ్ధి విలువ రూ.923.55 కోట్లు. ఇది ఎలా సాధ్యమైంది..? విద్యుత్తు చార్జీల పెంపు మాట వినడమే తప్ప తగ్గుదల అనే పదాన్ని ఊహించని వినియోగదారులకు ఊరట కలిగించేలా యూనిట్‌కు 13 పైసలు తగ్గుదల ఎలా సాధించగలిగారు..? వ్యవస్థలను సమర్థవంతంగా నడపగలిగితే ఏదైనా సాధ్యమేనన్నది పై ప్రశ్నలకు సమాధానం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. వైసీపీ హయాంలో కుదేలైన విద్యుత్తు వ్యవస్థలను చక్కదిద్దడంపై దృష్టి సారించారు. 2019కి ముందు రెన్యువబుల్‌ ఎనర్జీలో ఏపీ అగ్రస్థానంలో ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.


నాడు బాదుడే బాదుడు..

వైసీపీ ఐదేళ్ల కాలంలో విద్యుత్తు రంగాన్ని అవినీతికి కేంద్రంగా మార్చేసింది. ప్రజల ప్రయోజనాల కన్నా నేతలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. ఫలితంగా 9 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2019-20 నుంచి 2023-24 వరకు రూ.16,699 కోట్ల మేర విద్యుత్తు చార్జీలను పెంచి, ప్రజలపై భారం మోపారు. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో 2023-24 వరకు మరో రూ.5,886 కోట్లు బాదారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ట్రూఅప్‌ చార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టారు. దీని ద్వారా విద్యుత్తు వినియోగదారులపై రూ.3,977 కోట్ల విద్యుత్తు భారం మోపారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్తు చార్జీలను పెంచి మరో రూ.5,604 కోట్లు వసూలు చేశారు.మొత్తం మీద 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో విద్యుత్తు వినియోగదారులపై మోపిన భారం రూ.32,166 కోట్లు. వైసీపీ తీసుకొచ్చిన ట్రూఅప్‌ పాపం కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతూ వచ్చింది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు వసూలు చేసుకోవాల్సిన ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించడం, ప్రొవిజనల్‌ ఆర్డర్‌ పేరుతో దానికి మండలి ఆమోదం తెలపడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ట్రూఅప్‌ పేరుతో బాదుడు కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తొలిసారి ట్రూడౌన్‌ పేరుతో ఊరట కలిగించే చర్యలు చేపట్టారు. నిజానికి, జగన్‌ హయాంలోను ట్రూడౌన్‌ వెసులుబాటు కలిగింది. అయితే, ఆ ఫలాలను ప్రజలకు అందించలేదు. డిస్కమ్‌లే తమలో తాము పంచేసుకున్నాయి. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూడౌన్‌ ప్రయోజనాలను ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించింది. తమకు కలిగిన లబ్ధిని డిస్కమ్‌లు తిరిగి ప్రజలకు ఇచ్చేయడం 1999లో విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి!


నాడు నిలువెత్తు నిర్లక్ష్యం

  • వీటీపీఎస్‌ స్టేజ్‌-5 యూనిట్‌ -8(800 మెగావాట్లు) ప్రారంభించడంలో ఆలస్యం వల్ల రూ.2,029 కోట్ల అదనపు వడ్డీ ఖర్చు(ఇంటరెస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇన్‌ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ - ఐడీసీ) భరించాల్సి వచ్చింది. ఉత్పత్తి లేకపోవడం వల్ల స్వల్పకాలిక కొనుగోళ్లు చేయడం వల్ల 4,895 కోట్ల అదనపు భారం పడింది.

  • ఎస్‌డీఎస్‌టీపీఎస్ (కృష్ణపట్నం) స్టేజ్‌-2 యూనిట్‌-3 (800 మెగావాట్లు) ప్రారంభంలో ఆలస్యం వల్ల రూ.2,035 కోట్ల అదనపు వడ్డీ ఖర్చు (ఐడీసీ) భరించాల్సి రావడంతోపాటు స్వల్పకాలిక కొనుగోళ్ల వల్ల రూ.3,860 కోట్ల అదనపు భారం పడింది.

  • పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు ప్రారంభంలో ఆలస్యం వల్ల, ఆర్బిట్రేషన్‌ కారణంగా రూ.1,500 కోట్ల వరకు నష్ట పోవాల్సి వచ్చింది. సివిల్‌ పనుల జాప్యంతో ధరల వత్యాసం కారణంగా సుమారు రూ.350 కోట్లు అదనపు భారం పడింది. జూన్‌ 2024 వరకు స్వల్పకాలిక కొనుగోళ్ల వల్ల రూ.1,155 కోట్ల అదనపు భారాన్ని విద్యుత్తు సంస్థలు మోయాల్సి వచ్చింది. స్వల్పకాలిక విద్యుత్తు కొనుగోళ్లు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3,373 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11,655 మిలియన్‌ యూనిట్లకు పెరిగిపోయాయి. ఫలితంగా రూ.12,250 కోట్ల అదనపు భారం పడింది. గత ఐదేళ్లలో విద్యుత్తు సంస్థలు సుమారు రూ.1.25 లక్షల కోట్లు నష్టపోయాయని విద్యుత్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


నేడు దిద్దుబాటు చర్యలు...

  • వ్యవసాయానికి ఉదయం పూట ఉచిత విద్యుత్తును అందించేందుకు పీఎం కుసుమ్‌ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది.

  • పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఉచితంగా ఏర్పాటుతో విద్యుత్తు భారాన్ని తగ్గించుకునే చర్యలు చేపడుతున్నారు.

  • 1500 మెగావాట్లు, 3వేల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్‌(బీఈఎ్‌సఎ్‌స)ను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

  • వైసీపీ హయాంలో 17 శాతంపైగా ఉన్న షార్ట్‌ టర్మ్‌ విద్యుత్తు కొనుగోళ్లను 6.8 శాతానికి తగ్గించింది.

  • విద్యుత్తు స్వాపింగ్‌ విధానం తెచ్చింది. మన వద్ద ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి జరిగినప్పుడు దాన్ని ఇతర రాష్ట్రాల అవసరాలను బట్టి వారికి అందించి, మనకు అవసరం ఉన్నప్పుడు తిరిగి ఎలాంటి ఖర్చు లేకుండా పొందే విధానం ఇది. ఈ విధానంలో రాజస్థాన్‌, హరియాణాకు విద్యుత్తును ఇచ్చి మనకు అవసరం ఉన్నప్పుడు వారి నుంచి మనం విద్యుత్తును తీసుకుంటున్నాం. దీంతో కొనుగోళ్లపై పెట్టే అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గిపోయాయి.

  • బొగ్గు కొనుగోలు విధానాన్ని ప్రభుత్వం మెరుగుపర్చింది. రెన్యువబుల్‌ ఎనర్జీని ప్రోత్సహించడం, విద్యుత్తు పంపిణీ నష్టాలను నివారించడం ద్వారా విద్యుత్తు చార్జీలు తగ్గించేందుకు కృషి చేస్తోంది. వీటన్నింటి ఫలితమే ట్రూడౌన్‌ అనే పదాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రజలు వినగలుగుతున్నారు.


విద్యుత్తు సంస్థలపైనా భారం

వైసీపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్థలనూ అప్పుల్లో ముంచేసింది. చేసిన అప్పులను సమర్థవంతంగా వినియోగించకుండా అడ్డగోలుగా ఖర్చు చేసి విద్యుత్తు వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఏపీ విద్యుత్తు సంస్థల రుణం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.62,826 కోట్లు ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,422 కోట్లకు పెరిగింది. అంటే వైసీపీ హయాంలో రూ.49,596 కోట్ల మేర అప్పులు చేశారు. వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే విద్యుత్తు ఉత్పత్తి మెరుగుపడి వినియోగదారులపై భారం తగ్గేది. కానీ అదీ జరగలేదు. విద్యుత్తు సంస్థలకు రావాల్సిన బకాయిల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.12,945 కోట్లుగా ఉన్న బకాయిలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.52,091 కోట్లకు పెరిగాయి. అసమర్థ నిర్వహణకు ఈ పెరుగుదల నిదర్శనమని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 04:39 AM