Share News

Labour Secretary M.V. Seshagiri Babu: కార్మికుల పని గంటల్లో మార్పులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:32 AM

కార్మికుల పని గంటల విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజువారీ పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచింది.

 Labour Secretary M.V. Seshagiri Babu: కార్మికుల పని గంటల్లో మార్పులు

  • రోజుకు 8 నుంచి 10 గంటలకు పెంపు

  • వారానికి 48 గంటలకు మించకూడదని రూల్‌

  • మహిళా ఉద్యోగుల నైట్‌ డ్యూటీల్లోనూ మార్పు

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కార్మికుల పని గంటల విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజువారీ పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచింది. అయితే వారానికి 48 గంటలకు మించకూడదన్న నిబంధన పెట్టింది. దీనివల్ల వారానికి ఐదు రోజులు విధులు నిర్వహించే వారికి కొంత మేలు జరగనుంది. వారం మొత్తంలో పని గంటలు 48 గంటలు దాటితే కార్మికులకు ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’ చట్టానికి సవరణ చేసింది. సంబంధిత జీవోను కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు సోమవారం జారీచేశారు. మారిన పని గంటలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొన్నటి వరకూ వారానికి 14 గంటలు, నెలకు 50గంటల అదనపు పనికి అవకాశం ఉంది. ఇప్పుడు క్వార్టర్‌కు (మూడు నెలలు) 144 గంటలే అదనపు పనికి అవకాశం కల్పించారు. మహిళా ఉద్యోగులకు సంబంధించీ కొన్ని కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం మహిళలు రాత్రి సమయాల్లో డ్యూటీ చేయాలంటే సంబంధించిన షాపులు, కంపెనీలు కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఐదు మంది కంటే ఎక్కువ మహిళలు ఉంటేనే రాత్రి డ్యూటీలకు అనుమతిస్తారు. వారికి ప్రత్యేక టాయిలెట్లు, భోజన గది, వారి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. తాజా సవరణ ద్వారా వీటన్నింటినీ ప్రభుత్వం తొలగించింది. రాత్రి డ్యూటీ చేసేందుకు ఒక్క మహిళా ఉద్యోగికి కూడా అనుమతిచ్చింది.

Updated Date - Nov 04 , 2025 | 04:32 AM