AP Government: రాష్ట్ర, జిల్లా ప్రధాన రోడ్లకు వెయ్యి కోట్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:14 AM
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల విషయంలో ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రధాన రహదారులు (స్టేట్‌హైవేలు), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్) నిర్మాణం కోసం...
రహదారులపై ప్రభుత్వ హామీ అమల్లోకి
పనుల కోసం పరిపాలనా అనుమతులు
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రహదారుల విషయంలో ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రధాన రహదారులు (స్టేట్‌హైవేలు), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్) నిర్మాణం కోసం రూ.1000 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2104.09 కిలోమీటర్లను వెయ్యి కోట్లతో నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిది. ఇందులో స్టేట్‌హైవేలు 771.95 కిలోమీటర్లు, 108 వర్క్‌లు, ఎండీఆర్ 1332.14 కిలోమీటర్లు, 166 వర్క్‌లకు నిధులు మంజూరు చేస్తూ ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేట్ హైవే వర్క్‌లకు రూ.400 కోట్లు, ఎండీఆర్ ప్లాన్‌కు రూ.600 కోట్లు కేటాయించారు. గతంలో ఎమ్మెల్యేలు,ఎంపీలు, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి వర్క్‌లను ఎంపిక చేసి వాటికి పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇందులో నూతన రహదారుల నిర్మాణంతోపాటు అత్యధికంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు, విస్తరణ, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపిన నేపఽథ్యంలో జిల్లాలవారీగా టెండర్లు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది.