Share News

Deputy CM Pawan : ప్రతి రైతునూ ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:58 AM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Deputy CM Pawan : ప్రతి రైతునూ ఆదుకుంటాం

  • ముందస్తు సన్నద్ధతతో ‘మొంథా’ నష్టాన్ని తగ్గించాం: డిప్యూటీ సీఎం

  • అవనిగడ్డ నియోజకవర్గంలో నష్టం పరిశీలన

  • ముందుచూపుతో చంద్రబాబు జాగ్రత్త చర్యలు

  • ఆర్‌టీజీఎస్‌ నుంచి 24 గంటలూ పర్యవేక్షించాం

  • గ్రామస్థాయి వరకూ యంత్రాంగం అప్రమత్తం

  • పునరావాస కేంద్రాలకు 1.16 లక్షల మంది

  • కౌలు రైతులకు ప్రత్యేక సాయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం: పవన్‌ కల్యాణ్‌

  • 51 లక్షల టన్నుల ధాన్యం కొంటాం

  • క్వింటాకు 2,369 మద్దతు ధర ఇస్తాం: మనోహర్‌

అవనిగడ్డ/ కోడూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ముందస్తు సన్నద్ధతతో నష్టాల తీవ్రతను గణనీయంగా తగ్గించామని తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌, కలెక్టర్‌ డీకే బాలాజీతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్‌ కారణంగా 1.38 లక్షల హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని డిప్యూటీ సీఎం చెప్పారు. ‘సముద్రానికి అతి చేరువలో ఉండే దివి ప్రాంతంలో వరి పైరు పాలు పోసుకునే దశ, ఈనిన దశల్లో ఉంది.


పలు చోట్ల వరి పైరు నేలకొరడంతో రైతులు గణనీయంగా నష్టపోయారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగాం. ఆర్‌టీజీఎస్‌ ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని గ్రామస్థాయి వరకు అప్రమత్తం చేశాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1.16 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. అక్కడ ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరికీ.. ఇళ్లకు వెళ్లడానికి ముందే ఒక్కొక్కరికీ రూ.1,000 చొప్పున, కుటుంబానికైతే గరిష్ఠంగా రూ.3 వేలు, 25 కిలోల బియ్యం, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం, కందిపప్పు, లీటర్‌ వంట నూనె, కిలో వంతున బంగాళదుంపలు, పంచదార, ఉల్లిపాయలు అందిస్తున్నాం. విపత్తు కారణంగా నష్టపోయిన కౌలు రైతులను ప్రత్యేకంగా ఆదుకునే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపారు. తుఫాన్‌ అనంతరం ప్రభావిత గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా సూపర్‌ శానిటేషన్‌, సూపర్‌ క్లోరినేషన్‌ పద్దతుల ద్వారా ఉపశమన చర్యలను ప్రారంభించామని చెప్పారు. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు ఆ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలను చేపడతామని, జిల్లాల వారీగా సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు మొదలుపెట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,583 గ్రామాలు తుఫానుకు తీవ్రంగా ప్రభావితం కాగా.. ఆయా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం 21,055మంది సిబ్బందిని రంగంలోకిదించామని.. ఎక్కడైనా తాగునీటిసరఫరావ్యవస్థకు ఇబ్బంది ఎ దురైతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


తీర ప్రాంత రక్షణకు చర్యలు

ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీర ప్రాంత గ్రామాల్లో నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడతామని పవన్‌ కల్యాణ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సముద్రపు కరకట్టలు, కృష్ణా కరకట్టలు అధ్వాన స్థితికి చేరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. కలెక్టర్‌ను వివరణ కోరారు. అనంతరం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తీర ప్రాంతాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడూరు మండలంలో అవుట్‌ స్లూయిస్‌ దురవస్థ కారణంగా పంట పొలాల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరుతోందని, కొత్త స్లూయిస్‌ నిర్మాణానికి నాబార్డు సాయం తీసుకుంటామని తెలిపారు. సముద్రపు కోతకు గురై దెబ్బతిన్న ఎదురుమొండి-గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్లు కేటాయించామని, టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ప్రత్యేకాధికారి ఆమ్రపాలి, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్లు కొల్లూరి వెంకటేశ్వరరావు, తోట కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 04:02 AM