JP Ventures: 6 క్వారీలకే జరిమానా కడతాం
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:08 AM
జగన్ హయాం లో జరిగిన ఇసుక అక్రమాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) విధించిన జరిమానాను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని జయప్రకాశ్ వెంచర్స్ పవర్ లిమిటెడ్...
మిగతా 12 ఇసుక క్వారీలకు ఏపీనే చెల్లించాలి: సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్
న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): జగన్ హయాం లో జరిగిన ఇసుక అక్రమాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) విధించిన జరిమానాను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని జయప్రకాశ్ వెంచర్స్ పవర్ లిమిటెడ్(జేపీ వెంచర్స్) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్‌జీటీ ఆదేశించిన విధంగా రూ.18 కోట్ల జరిమానాను రెండు వారాల్లోపు రిజిస్ర్టీలో డిపాజిట్ చేయాలని జేపీ వెంచర్స్‌ను కోర్టు గతంలో ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దానిపై సోమవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జేపీ వెంచర్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 18 ఇసుక క్వారీల్లో ఆరింటికి మాత్రమే తాము పర్యావరణ అనుమతులు(ఈసీ) తీసుకున్నామని, మిగిలి న 12 క్వారీలకు అప్పటి ప్రభుత్వమే అనుమతులు తీసుకుందన్నారు. అందుచేత తాము అనుమతి తీసుకున్న ఆరింటికి మాత్రమే జరిమానా కడతామని, మిగిలిన 12 క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఈ మేరకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయవా ది కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబం ధించి జేపీ వెంచర్స్‌కు ఎన్‌జీటీ దాదాపు రూ.18 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పును ఆ సంస్థ 2023 మే 15న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జరిమానా చెల్లింపుపై కో ర్టు ఆ ఏడాది జూలై 14న స్టే విధించింది. ఆ తర్వాత జరిగిన విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులను రద్దుచేసింది. 2 వారాల్లోపు రిజిస్ర్టీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.