Minister BC Janardhan Reddy: 2,500 కోట్లతో రోడ్ల టెండర్లు
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:24 AM
రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు....
త్వరలో మరో వెయ్యి కోట్లతో కూడా..: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
ఆర్‌డీసీ బోర్డు కొత్త డైరెక్టర్ల ప్రమాణస్వీకారం
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే రూ.2,500 కోట్లతో రహదారి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలో మరో రూ.వెయ్యి కోట్లతో రహదారి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ)లో కొత్తగా నియమితులైన 16 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం ఆర్‌అండ్‌బీ భవన్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్‌డీసీ చైర్మన్, సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం రెన్యూవల్ వర్క్‌లు కూడా చేయలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే రూ.1,081 కోట్లతో రహదారులపై గుంతలను పూడ్చేసి, ప్రయాణాలకు అనువుగా మార్చామన్నారు. సమావేశంలో ఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ఆ సంస్థ ఎండీ, చీఫ్ ఇంజనీర్ ఎల్.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.