Share News

Minister Anita: ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:08 AM

కర్నూలు-బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శుక్రవారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Minister Anita: ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు

  • మృతదేహాలను గుర్తించేందుకు 16 మందితో ఫోరెన్సిక్‌ టీం: హోం మంత్రి అనిత

కర్నూలు క్రైం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు-బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శుక్రవారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాథమిక సమాచారం మేరకు.. బస్సులో మొత్తం 39 మంది పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు మంత్రి అనిత తెలిపారు. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అరంఘర్‌ చౌరస్తా వద్ద ఎక్కగా, అందులో ఒకరు దిగిపోయారన్నారు. ఎదురుగా వస్తున్న బైక్‌ను బస్సు ఢీకొని 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకు వెళ్లడంతో మంటలు(స్పార్క్‌) చెలరేగి బస్సులోని 19 మంది మృత్యువాతపడినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత 3.21 గంటలకు స్థానిక సీఐకు సమాచారం వచ్చిన వెంటనే పోలీసు, అగ్నిమాపక శాఖ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ప్రయాణికులు ఎగ్జిట్‌ డోర్‌ను పగులకొట్టడం ద్వారా వారికి వారే రెస్క్యూ ఆపరేషన్‌ చేసుకుని బయటకు వచ్చారని తెలిపారు. కాగా, మృతదేహాలను గుర్తించేందుకు 16 మందితో ఫోరెన్సిక్‌ టీం ఏర్పాటు చేశామన్నారు. అందులో డీఎన్‌ఏ పరీక్షలు చేసేందుకే 10 మంది ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.


హైవేలపై ఇది మూడో ప్రమాదం: రవాణా మంత్రి

కొత్త బస్సులన్నింటిలో ఆటోమేటిక్‌ ఫైర్‌ అలారం సిస్టం ఎనేబుల్‌ చేస్తున్నామని ఏపీ మంత్రి రాంప్రసాద్‌ వెల్లడించారు. సేఫ్టీ మెజర్స్‌ అన్నీ తీసుకుంటున్నాని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఏడు సంవత్సరాల క్రితంది కావడంతో అందులో ఫైర్‌ అలారం సిస్టం లేదని తెలిపారు. ఇటీవల హైవేలపై అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఇది మూడో సంఘటన అని, ఈ అంశంపై తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో మాట్లాడతామని తెలిపారు. మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేసిన తక్షణమే బంధువులకు అప్పగిస్తామని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ డైరెక్టర్‌ పాలరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 05:10 AM