Share News

AP Government: రెవెన్యూ అధికారులపై సర్కారు కొరడా

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:21 AM

ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనా కన్నెత్తిచూడని, కీలకమైన ‘వెబ్‌ల్యాండ్‌’లో తప్పుడు ఎంట్రీలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

AP Government: రెవెన్యూ అధికారులపై సర్కారు కొరడా

  • పల్నాడులో 20 మందిపై తీవ్ర అభియోగాలు

  • నగరి, కలసపాడు మండల అధికారులపై విచారణ

  • భూకబ్జా, వెబ్‌ల్యాండ్‌ తప్పులపై తీవ్ర ఆగ్రహం

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనా కన్నెత్తిచూడని, కీలకమైన ‘వెబ్‌ల్యాండ్‌’లో తప్పుడు ఎంట్రీలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ముఖ్యంగా పల్నాడుజిల్లా మాచర్ల, వెల్దుర్తి మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా నగరి తహసీల్దార్లపైనా చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి మండలంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఓ వ్యక్తి కబ్జా చేసినా తహసీల్దార్లు చర్యలు తీసుకోలేదు. వీరితోపాటు ఇతర అధికారులపైనా విచారణ చేపట్టాలని జయలక్ష్మి ఆదేశించారు. నగరి ఆర్డీవోను విచారణాధికారిగా నియమించారు. నగరిలో గతంలో తహసీల్దార్లుగా పనిచేసిన కె. వెంకటరమణ, కె. బాబు, గ్రామ రెవెన్యూ అధికారులు సదాశివ పిళ్లై, దేవదాసు తదితరులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే వారిపై అభియోగాలు నమోదు అయ్యాయని.. వాటికి అనుగుణంగా విచారణ చేపట్టాలని జయలక్ష్మి పేర్కొన్నారు.


  • నగరి మండలంలోని ఎన్‌.ఆర్‌. కుప్పం గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేరింది. అయితే, లోకాయుక్తను తప్పుదోవ పట్టించేలా రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. దీంతో సదరు అధికారులపై అభియోగాలు నమోదయ్యాయి.

  • కడప జిల్లా కలసపాడు మండలంలో గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ఎం. మోహన్‌రావుతోపాటు మరికొందరు అధికారులపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో అడ్డగోలు ఎంట్రీలు చేశారన్న అభియోగాలపై విచారణ చేపట్టాలని బద్వేలు ఆర్డీఓను జయలక్ష్మి ఆదేశించారు.

  • పల్నాడు జిల్లా మాచర్ల, వెల్దుర్తి తదితర మండలాల రెవెన్యూ అధికారులపై మూకుమ్మడిగా శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. గతంలో ఈ మండల కార్యాలయాల పరిధిలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో అధికారుల వద్ద లెక్క చూపని డబ్బు దొరికింది. నిబంధనల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాల్సిన ‘మీ సేవ’ దరాఖాస్తులను గడువు దాటిన తర్వాత కూడా పెండింగ్‌లో ఉంచారు. ఇలా ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్న దానికి రెవెన్యూ అధికారులు ఏసీబీకి అర్ధంలేని కారణాలు చెప్పారు.

  • ఈ నేపథ్యంలో ఒకేసారి మాచర్ల, వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఒకేసారి 20 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 05:22 AM