AP Government: చెల్లించేస్తాం
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:21 AM
ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుకగా ప్రకటించిన డీఏ చెల్లింపులో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని...
డీఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత
వచ్చే ఏప్రిల్‌లో పది శాతం జమ
మిగిలిన 90 శాతం మూడు విడతల్లో
జీపీఎఫ్, ప్రాన్ ఖాతాల్లో జమ చేస్తాం
ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందన
ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ
సీఎం ఆదేశాలతో సవరణ జీవో జారీ
సవరణ జీవోపై ఉద్యోగ సంఘాల హర్షం
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుకగా ప్రకటించిన డీఏ చెల్లింపులో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని... అప్పటికప్పుడు పొరపాటును సవరించింది. తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి భేషజాలు ప్రదర్శించబోమని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే... దీనికి సంబంధించి సోమవారం జారీ అయిన జీవోల్లో అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 3.64 శాతం డీఏ బకాయిలను... రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో... 21 నెలల డీఏ బకాయిల కోసం రిటైర్మెంట్ దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏమిటంటూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంగళవారం తీవ్రస్థాయిలో కసరత్తు జరిగింది. ఉద్యోగుల డిమాండ్‌ను అర్థం చేసుకున్న ప్రభుత్వం... దీనిపై మంగళరం రాత్రి సవరణ జీవో జారీ చేసింది. దీని ప్రకారం... 2024 జనవరి డీఏకు సంబంధించిన బకాయిలు అంటే 21 నెలల బకాయిలను నాలుగు విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు. బకాయిల్లో 10 శాతాన్ని 2026 ఏప్రిల్‌లో చెల్లిస్తారు.
ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లోకి... సీపీఎస్, పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కలిపి వారి ప్రాన్ ఖాతాల్లోకి జమ చేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 3 సమాన భాగాల్లో 2026 ఆగస్టు, 2026 నవంబరు, 2027 ఫిబ్రవరి నెలల్లో అందిస్తామని జీవోల్లో స్పష్టం చేశారు. ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని... సీపీఎస్, పీటీడీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవోలో వెల్లడించారు.
సీఎం ఓ వైపు.. ఆర్థిక శాఖ మరోవైపు
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తుంటే, మరోవైపు ఆర్థిక శాఖ నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, అందువల్ల డీఏ బకాయిలు రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి దూరం పెంచేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఇది తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి స్పందించారు. మంగళవారం ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మందలించారు. ఇకపై ఇలాంటి తప్పులు దొర్లకూడదని, సాధారణంగా డీఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడూ చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం రాత్రి జీవో 62 విడుదల చేసింది.
పదోన్నతులపై ధన్యవాదాలు
సీఎంను కలిసిన ఆర్టీసీ కార్మిక పరిషత్
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు డీఏ సహా ఆర్టీసీలో పదోన్నతులు కల్పించడంపై ఆర్టీసీ కార్మిక పరిషత్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం ఈ మేరకు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడారు. ‘ఆరేళ్లుగా పదోన్నతులు రాక ఇబ్బందులుపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు పదోన్నతులు ఇచ్చారు. సీఎం ఆమోదంతో 3 వేల మందికి పదోన్నతులు వస్తున్నాయి. ఆర్టీసీలో మరిన్ని సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. స్త్రీశక్తి పథకం అమలు దృష్ట్యా ఆర్టీసీలో అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరాం. విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎ్‌స అందడం లేదని, విధి విధానాలు విడుదలు చేయాలని విజ్ఞప్తి చేశాం. అమరావతి బ్రాండ్ బస్సులు 100 కొనుగోలు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు తిరుమలలో శ్రీవారి దర్శనం పునరుద్ధరించాలని, రోజుకు 5 వేల మంది భక్తులకు ఆర్టీసీ ద్వారా శ్రీవారి దర్శనం కల్పించాలని సీఎంకు విన్నవించాం. ఆయన మా వినతులపై సానుకూలంగా స్పందించారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు’ అని పరిషత్ నేతలు చెప్పారు.
ఉద్యోగ సంఘాల హర్షం
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గత ఆరేళ్లలో మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించిన ప్రభుత్వం పలు సమస్యలు పరిష్కరించింది. తాజాగా డీఏ విడుదల జీవోలో ఏర్పడిన ఇబ్బందులనూ తొలగిస్తూ రివైజ్డ్ డీఏ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి ఏపీ ఎన్జీజీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటే షెడ్యూల్‌లో మూడు విడతలుగా డీఏ బకాయిలు విడుదల చేయడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు స్వాంతన కలిగించిందన్నారు. జీవోలో ఉన్న ఇబ్బందులను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే స్పందించిన సీఎం చంద్రబాబు, ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, సీఎంవో అధికారులకు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ తదితర అంశాల్లో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాజీలేని ధోరణిని అవలంభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఏపీ సచివాలయ సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటన చేస్తూ... ‘డీఏ అరియర్స్ గందరగోళానికి చెక్‌పెట్టి, రివైజ్డ్ జీవో ను ఇప్పించిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు.