Share News

AP Govt: క్వింటా ఉల్లి రూ.1,200లకు కొనుగోలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:08 AM

రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. నాలుగైదు రోజులుగా మార్క్‌ఫెడ్‌-మార్కెటింగ్‌శాఖ ద్వారా క్వింటా రూ.1,200 మద్దతు ధర చెల్లిస్తూ రైతుల నుంచి కొనుగోలు చేయిస్తోంది.

AP Govt: క్వింటా ఉల్లి రూ.1,200లకు కొనుగోలు

  • రైతు బజార్లలో కిలో 15కు విక్రయం

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. నాలుగైదు రోజులుగా మార్క్‌ఫెడ్‌-మార్కెటింగ్‌శాఖ ద్వారా క్వింటా రూ.1,200 మద్దతు ధర చెల్లిస్తూ రైతుల నుంచి కొనుగోలు చేయిస్తోంది. సోమవారం కర్నూలు మార్కెట్‌ యార్డుకు 1,694 క్వింటాళ్ల ఉల్లి దిగుమతి రాగా, 1,612 క్వింటాళ్లు మార్క్‌ఫెడ్‌, 82 క్వింటాళ్లు అక్కడి వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటా కనిష్ఠ ధర రూ.1,200 పలకగా, గరిష్ఠ ధర రూ.1,329 పలికింది. రైతు బజార్లకు తరలించి కిలో రూ.14-15 చొప్పున అమ్ముతున్నారు. ఇప్పటికే 95 టన్నుల ఉల్లిని వివిధ జిల్లాల్లోని 75 రైతుబజార్లకు తరలించినట్లు రైతుబజార్ల సీఈవో మాధవీలత చెప్పారు. 5 మొబైల్‌ వాహనాలను ఏర్పాటు చేసి, వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సీఈవో తెలిపారు.


కర్నూలు ఉల్లి కొనండి: వ్యాపారులకు అధికారుల సూచన

వ్యాపారులు మహారాష్ట్ర ఉల్లి దిగుమతులు తగ్గించి, కర్నూలు ఉల్లి అమ్మకాలు పెంచాలని అధికారులు సూచించారు. కర్నూలు ఉల్లి ధర పతనమై రైతులు నష్టపోతున్న వైనంపై ‘ఉల్లిరైతు బేజారు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌ను కలెక్టర్‌ సి.నాగరాణి సోమవారం సందర్శించారు. నేరుగా ఉల్లి విక్రయ దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో సమీక్షించారు. కర్నూలు నుంచి ఎంత ఉల్లి వస్తోంది? ధర పడిపోవడానికి కారణాలేంటి అని అడిగి తెలుసుకున్నారు. కర్నూలు ఉల్లి నాణ్యత లేకపోవడం, నిల్వ సామర్థ్యం లేకపోవడంతో వినియోగం తగ్గిందని వ్యాపారులు వివరించారు. కర్నూలు ఉల్లి ఎక్కువగా విక్రయించేలా వ్యాపారులు సహకరించాలని కలెక్టర్‌ సూచించారు. కాగా.. తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌ను రీజనల్‌ మార్కెటింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి కర్నూలు ఉల్లి రైతులను ఆదుకునేందుకు సహకరించాలని కోరారు.

రూ.2,500 చొప్పున ప్రభుత్వమే కొనాలి: సీపీఐ

అమరావతి: ఉల్లి క్వింటాలుకు రూ.2,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉల్లి రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు.

Updated Date - Sep 02 , 2025 | 07:09 AM